పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతను కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. ముందు తుపాకీతో కాల్చి ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపాారు. ఆయన ఇద్దరి అనుచరులనూ కాల్చి చంపిన ఘటన ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. రాష్ట్రంలో హింసా రాజకీయాలు ముగిసేలా లేవు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత కూడా జరిగిన హింస దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. తాజాగా, టీఎంసీ నేతను కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. ఆయనతోపాటు ఇద్దరు అనుచరులనూ చంపేశారు. కోల్‌కతాకు 50 కిలోమీటర్ల దూరంలోని క్యానింగ్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

గోపాల్‌పూర్ గ్రామ పంచాయతీ సభ్యుడు స్వపన్ మాఝీ ఈ రోజు ఉదయం 9 గంటలకు ఓ మీటింగ్‌కు హాజరు కావడానికి బయల్దేరాడు. మార్గం మధ్యలోనే జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అదును చూసి దుండగులు టీఎంసీ లీడర స్వపన్ మాఝీని షూట్ చేశారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన స్వపన్ మాఝీని కత్తులతో పొడిచారు. స్పాట్‌ను పారిపోవడానికి ప్రయత్నించిన స్వపన్ మాఝీ అనుచరులు ఇద్దరినీ కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా వివరాల సేకరణ చేపడుతున్నామని పోలీసులు వివరించారు.