దయ్యాన్ని వదిలిస్తామంటూ మహిళ మీద నిప్పులు చల్లి.. రెండు చేతులూ కాల్చిన ఘటన రాజస్థాన్ లో కలకలం రేపింది. ఇద్దరు పూజారులు ఈ దారుణానికి ఒడిగట్టారు. 

రాజస్థాన్ : రాజస్థాన్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భూతవైద్యం పేరుతో ఓ మహిళ చేతులపై మండుతున్న బొగ్గు కణికలను పెట్టారు ఇద్దరు పూజారులు. దీంతో ఆ మహిళ చేతులు రెండు కాలిపోయాయి. ఈ ఘటన రాజస్థాన్లోని జుంజునులోని కేత్రి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ పిఎస్ పరిధిలోని బదౌ గ్రామంలో భూత వైద్యం పేరుతో ఇద్దరు పూజారులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

ఆమె తన ఫిర్యాదులో ఈ విషయం ఎక్కడైనా చెబితే తమ కుటుంబాన్ని చంపేస్తామని పూజారులు బెదిరించారని పేర్కొంది. అందుకే నెల రోజుల తర్వాత ధైర్యం తెచ్చుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామంటూ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్టేషన్ ఆఫీసర్ అజయ్ సింగ్ తెలుపుతూ.. గుడా గార్జి నివాసి అయిన మౌనిక తన భర్త వినోద్ కుమావత్ తో పాటు బదౌలిలోని బాలాజీ ఆలయానికి వెళ్ళింది.

మహిళా పోలీసుపై బీజేపీ ఎమ్మెల్యే దాష్టీకం.. వీడియో వైరల్..

ఆలయంలో ఉన్న పూజారులు రమేష్ సైనీ, రోహితాష్ సైనీలు మౌనికను ఆలయంలోని ఓ గదిలోకి పిలిపించారు. ఆ తర్వాత రెండు మండుతున్న నిప్పు కణికలను ఆమె రెండు చేతులపై వేశారు. ఆమె మీద దయ్యం ఉందని దాన్ని వదిలిస్తున్నామని అన్నారు. మండుతున్న నిప్పు కణికలు పడడంతో మౌనిక రెండు చేతులు కాలిపోయాయి. మ్టంటల బాధతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో బయట ఉన్న భర్త వినోద్ కుమావత్ అక్కడికి వచ్చాడు.

అప్పటికే భార్య రెండు చేతులు కాలిపోయి నొప్పితో విలవిల్లాడుతూ కేకలుపెడుతోంది. అది చూసిన వినోద్ ఒకసారిగా షాక్ అయ్యి.. వెంటనే ఆమెను అక్కడి నుంచి దగ్గర్లోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స చేసుకొని ఆమె కోలుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి దీనిమీద కంప్లైంట్ చేశారు. అయితే తన మీద ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న పూజారులు వారిని బెదిరించారు. తమను చంపేస్తామంటూ బెదిరించారని వినోద్ కుమావత్ మీడియాకు తెలిపారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.