సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఈ సందర్భంలో వీసీకే చీఫ్ తిరుమావలవన్ ఉదయనిధి వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు. ఉదయనిధి వ్యాఖ్యలు అంబేద్కర్, పెరియార్ భావజాలం, సమానత్వ భావజాలం నుంచి వచ్చాయని చెప్పారు. ఆయన సనాతన భావజాలాన్ని నిర్మూలించాలని అన్నాడు గానీ, హిందువులను కాదని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం అంటువ్యాధి వంటిదని, డెంగ్యూ, ఫ్లూ వంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి ఓ రచయితల సమావేశంలో అన్నారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమిత్ షా సహా బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజం ఎత్తారు. హిందువుల ఊచకోతకు ఆయన పిలుపు ఇచ్చారని ఆరోపించారు. ఉదయనిధి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోబోనని స్పష్టం చేశారు. తాను హిందువుల మరణాన్ని కోరలేదని, కేవలం భావజాలం గురించే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. దేశమంతటా దీనిపై చర్చ జరుగుతుండగా.. విడుదలై చిరుతైగల్ కాచ్చి చీఫ్ తొల్ తిరుమావలవన్ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వెంట నిలబడ్డారు. ఉదయనిధి వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయనకు మద్దతు ఇచ్చారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ఉటంకిస్తూ తిరుమావలవన్ ఈ విధంగా మాట్లాడారు.. ‘ సనాతన ధర్మ లేదా హిందూ ధర్మ ఒక అంటువ్యాధి వంటిది. భవిష్యత్‌లో దీన్ని నిర్మూలించాలి. అలాగైతేనే ప్రజల మధ్య సమానత్వం ఏర్పడుతుంది. కాబట్టి, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పెరియార్ భావజాలాన్ని, అంబేద్కర్ భావజాలాన్ని, సమానత్వ భావజాలాన్ని మాట్లాడారు. ఇది హిందూ సముదాయానికి వ్యతిరేకం కాదు. మేం సంఘపరివార్ అజెండాను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. వారి అజెండా ఏమీ లేదు హిందుత్వ మాత్రమే. అంతేగానీ, మేం హిందువులకు వ్యతిరేకం కాదు. మేం హిందూత్వకు వ్యతిరేకం. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల రాజకీయ అజెండానే హిందూత్వ. తప్పితే మేం హిందువులకు వ్యతిరేకం కాదు’ అని తెలిపారు.
Also Read: సీఎం కొడుకు స్టాలిన్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్.. ‘సనాతన ధర్మాన్ని దోమతో పోల్చాడు’
హిందువుల విశ్వాసాలకు తాము వ్యతిరేకం కాదని, హిందువులు శివుడి, విష్ణువు, ఇలా దేవుళ్లపై అచంచల విశ్వాసాన్ని కలిగి ఉంటారని, వారి ఈ విశ్వాసాలను తాము వ్యతిరేకించడం లేదని, విమర్శించడం లేదని తిరుమావలవన్ స్పష్టం చేశారు. వాళ్లే హిందువుల విశ్వాసాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఉదయనిధి కేవలం సనాతన భావజాలాన్ని మాత్రమే నిర్మూలించాలని అన్నాడని, హిందువులను కాదని స్పష్టం చేశారు. కానీ, వారు మాత్రం రకరకాల కాంప్లికేషన్స్, సమస్యలు తెచ్చి హిందువుల మధ్య చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. వాళ్లు హిందువుల విశ్వాసాలను చీట్ చేస్తున్నారని అన్నారు. కాబట్టి, హిందువులు ఇలాంటి తప్పుదారి పట్టించేవారిని ఫాలో కావొద్దని సూచించారు. వాళ్లు వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పని చేస్తున్నారని ఆరోపించారు. ఇది అంతిమంగా హిందువులకే సమస్యలను తెచ్చి పెడుతుందని తెలిపారు.
