ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ఓ వ్యక్తి పాడైన లిఫ్ట్ ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ లిఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయి. కానీ, ఆ లిఫ్ట్ పని చేయడంలేదనే బోర్డులేవీ పెట్టలేదు. దీంతో ఆ వ్యక్తి లిఫ్ట్ ఎక్కాడు. క్షణాల్లో పలు ఫ్లోర్‌లను దాటేసి ఒక్కపెట్టున గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చి పడింది. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పాడైపోయిన లిఫ్ట్ ఎక్కాడు. అతను ముట్టుకోగానే డోర్ తెరుచుకోవడంతో అందులోకి ఎక్కాడు. అంతే.. ఆ తర్వాత వెంటనే తటాలున ఆ లిఫ్ట్ పై అంతస్తుల నుంచి కిందకు వచ్చి పడింది. అందులోని వ్యక్తి మరణించాడు. సహరన్‌పూర్‌లోని ఓ మాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ లిఫ్ట్ పాడైపోయిందని యాజమాన్యానికి తెలుసు అని, కానీ, నిర్లక్ష్యపూరిత వైఖరితో కనీసం హెచ్చరిక బోర్డులనూ అక్కడ ఏర్పాటు చేయలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

స్పాట్‌కు చేరుకున్న పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు.

మృతి చెందిన వ్యక్తిని రాంపూర్ ఏరియాలో నివసించే అమనర్ కుమార్‌గా గుర్తించారు. సహరన్‌పూర్‌లో సదర్ బజార్ ఏరియాలోని జీఎన్‌జీ మాల్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనతో హతాశయులయ్యారు. ఆ లిఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని తెలిపారు. అమన్ కుమార్ టచ్ చేయగానే డోర్ ఓపెన్ అయిందనీ వివరించారు. వెంటనే ఆ లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వచ్చి పడిందని తెలిపారు.

Also Read: కర్ణాటక క్యాబినెట్ విస్తరణ.. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మంత్రిత్వ శాఖలపై ఉత్కంఠ.. హోం శాఖ ఆయనకేనా?

నిర్లక్ష్యం వహించిన ఆ మాల్ యాజమాన్యపై యాక్షన్ తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. ఆ ఏరియా మొత్తం ఈ ఘటనతో ఖంగుతిన్నట్టయింది.