ఇండియా టెక్కీలకు శుభవార్త: హెచ్-4 వీసా రద్దు నోటీఫీకేషన్ జారీపై వెనక్కి తగ్గిన ట్రంప్

US: Trump administration misses deadline on H4 visa notification
Highlights

ఇండియన్ టెక్కీలకు శుభవార్త: హెచ్-4 వీసా రద్దుపై వెనక్కి తగ్గిన ట్రంప్

వాషింగ్టన్: అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్‌-4 వీసాలకు సంబంధించి ప్రస్తుతానికి  ఊరట లభించింది. హెచ్‌-4 వీసాదారులకు పని అనుమతి రద్దు చేయడంపై అమెరికా ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. ఈ ఏడాది రెండో సారి కూడా డెడ్‌లైన్‌ మిస్‌ అయ్యింది. 

హెచ్‌-4 వీసాలకు పని అనుమతి రద్దు చేస్తే ఆ ప్రభావం ముఖ్యంగా భారతీయులపైనే పడుతుంది. హెచ్‌-1వీసాలపై అమెరికాలో నివాసం ఉంటున్న జీవిత భాగస్వాములు ఎక్కువమంది మహిళలు హెచ్‌-4 వీసాలపై ఉద్యోగాలు చేస్తున్నారు. ట్రంప్‌ ఈ వీసాలను రద్దు చేస్తే ఎక్కువ మంది భారతీయులు ఉపాధిని కోల్పోయే అవకాశం లేకపోలేదు.

హెచ్‌-4 వీసాలను రద్దు అంశంపై ఈ ఏడాది జూన్‌లోగా నోటీస్‌ ఆఫ్‌ ప్రపోజ్‌డ్‌ రూల్‌ మేకింగ్‌(ఎన్‌పీఆర్‌ఎం)‌ జారీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ మార్చిలో కోర్టుకు తెలిపింది. కాగా, జూన్‌ నెల అయిపోయినప్పటికీ ఎన్‌పీఆర్‌ఎంపై ఎందుకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదో హోం ల్యాండ్‌ సెక్యురిటీ ఎలాంటి ప్రకటించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇలాంటి డెడ్‌లైన్‌నే మిస్‌ అయ్యింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ఈ హెచ్‌-4 వీసాలను ప్రవేశపెట్టారు. కానీ, ఈ విధానాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు.అందుకే  హెచ్ 4 వీసాలను పూర్తిగా రద్దు చేయాలని భావిస్తున్నారు. ట్రంప్‌ నిర్ణయంలో మార్పులేదని హోంల్యాండ్‌ సెక్యురిటీ ఈ ఏడాది పలుమార్లు వెల్లడించింది. 

కానీ, నోటిఫికేషన్‌ ఇవ్వడంలో మాత్రం విఫలమైంది. హెచ్‌-4 వీసా విధానం రద్దు చేయొద్దని అమెరికాలోని ప్రధాన ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. దాని ప్రభావం ఉద్యోగులపై, బిజినెస్‌ ఆపరేషన్స్‌పైనా పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

loader