ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను సమర్థిస్తున్నదని తెలుసుకుని ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. ఇంటి నుంచి పంపించేశాడు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
లక్నో: వారిద్దరి కాపురంలో రాజకీయం చిచ్చుపెట్టింది. భిన్న రాజకీయాల అభిరుచులు వారి సంసారానికే ముప్పును తెచ్చి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను సమర్థిస్తున్నదని ఓ ఉత్తరప్రదేశ్ నివాసి తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. ప్రధాని మోడీ, సీఎం యోగికి ఓటు వేసినందుకు తన అత్తవారంటివారు తీవ్రంగా వేధించారని ఓ మహిళ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చింది.
మార్చి 3వ తేదీనే ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కానీ, వెలుగులోకి ఆలస్యంగా వచ్చింది. ఈ ఎఫ్ఐఆర్‌లో నేడు దర్యాప్తు మొదలైంది. ఈ కేసు మొరదాబాద్‌లోని కొత్వాలి పోలీసు స్టేషన్‌లో నమోదైంది.
షనా ఇరామ్ అనే మహిళ మొహమ్మద్ నదీమ్‌ను 2019 డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంది. ఆయన మొరదాబాద్‌లోని పీర్జాదా నివాసి. అయితే, తాను ప్రధాని మోడీ, సీఎం యోగికి సమర్థకురాలిని అని తెలిసిన తర్వాత మెట్టినింటి వారు తనపై కక్షసాధింపులకు పాల్పడ్డారని షనా ఇరామ్ తన ఫిర్యాదులో పేర్కొంది. భర్త తనకు ట్రిపుల్ తలాఖ్ చెప్పి ఇంటి నుంచి పంపించి వేశాడని తెలిపింది.
తనకు పెళ్లి అయిన కొన్ని రోజులకే తన అత్తింటి వారు వేధింపులు ప్రారంభించారని ఆమె వాపోయింది. ప్రధాని మోడీని, సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు సపోర్ట్ చేయడమే తన తప్పు అని పేర్కొంది.
ఆ మహిళ ఫిర్యాదుతో తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ అఖిలేశ్ భదోరియా తెలిపారు. ఐపీసీలోని 376, 511 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామని వివరించారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కొత్వాలి పోలీసు స్టేషన్ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.