ఓ వైపు వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే రాజకీయ నేతలు ఈ పరిస్ధితిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యానికి పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లే కారణమన్నారు ఉత్తరప్రదేశ్‌ బీజేపీ నేత వినీత్ అగర్వాల్.

Also Read:Delhi pollution: ప్రమాదకర స్థాయిలో కాలుష్యం..ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే!

ఈ రెండు దేశాలు దేశరాజధానిలోకి విష వాయువులను వదిలి పెడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ-అమిత్ షాల త్రయం సాధారణ ఎన్నికల్లో రెండవ సారి విజయం సాధించిన తర్వాత నిరాశకు గురైన చైనా, పాకిస్తాన్‌లు విషవాయువులను విడిచి పెడుతున్నాయని వినీత్ పేర్కొన్నారు.

మహాభారతంలో కృష్ణార్జునుల్లా మోడీ, అమిత్ షాలు దేశంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హర్యానా, పంజాబ్‌ రైతులు పంటపొలాల్లో వ్యర్థాలను దహనం చేయడం వల్లే కలుషిత వాయువులు వెలువడుతున్నాయన్న అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యల్లో అర్ధం లేదని వినీత్ అగర్వాల్ స్పష్టం చేశారు. 

దేశ రాజధాని ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదస్థాయికి మించిపోవడంతో ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. వాయు కాలుష్యాన్ని అంచనా వేసేందుకు పీఎంవో ముఖ్యకార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది.

Also read:DELHI AIR POLLUTION: ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ కాలుష్యం: రంగంలోకి పీఎంవో

ఇందులో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఈ కమిటీ ప్రతిరోజు రోజువారీ కాలుష్య పరిస్ధితులను పర్యవేక్షించనుంది.

గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు సుమారు 300 బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు. ఇందుకు అవసరమైన సామాగ్రిని సైతం వారికి అందజేశామని పీకే మిశ్రా తెలిపారు. ఇక 7 పారిశ్రామిక క్లస్టర్‌లు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మిశ్రా వెల్లడించారు. 

మరోవైపు కాలుష్యం కారణంగా ఢిల్లీలో నివసించేందుకు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి విధానాన్ని తిరిగి అమలు చేస్తుండటంతో వాహనదారులు స్వాగతిస్తున్నారు. అయినప్పటికీ కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం నిలిపివేయాలని ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది.