దేశ రాజధాని ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదస్థాయికి మించిపోవడంతో ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. వాయు కాలుష్యాన్ని అంచనా వేసేందుకు పీఎంవో ముఖ్యకార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది.

ఇందులో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఈ కమిటీ ప్రతిరోజు రోజువారీ కాలుష్య పరిస్ధితులను పర్యవేక్షించనుంది.

గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు సుమారు 300 బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు. ఇందుకు అవసరమైన సామాగ్రిని సైతం వారికి అందజేశామని పీకే మిశ్రా తెలిపారు. ఇక 7 పారిశ్రామిక క్లస్టర్‌లు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మిశ్రా వెల్లడించారు. 

Also Read:Delhi pollution: ప్రమాదకర స్థాయిలో కాలుష్యం..ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే!

ఈ సమావేశంలో పంజాబ్ చీఫ్ సెక్రటరీ కరన్ అవతార్ సింగ్ మాట్లాడుతూ.. తాను కాలుష్యంపై వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. డిప్యూటీ కమీషనర్లతో పాటు జిల్లా అధికారుల సాయంతో ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాలుష్యానికి కారణమవుతున్న వారిపై ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్-1981 ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

హర్యానా సీఎస్ ఆనంద్ ఆరోరా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారని.. రైతులు పంట వ్యర్ధాలను తగులబెట్టడంపై అవగాహన కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. 

అలాగే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా కాలుష్యానికి కారణమవుతున్న మట్టి, వాహన ఉద్గారాలపై నియంత్రణా చర్యలు తీసుకోవాల్సిందిగా మిశ్రా.. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ విజయ్ దేవ్‌ను ఆదేశించారు. భవన నిర్మాణలు, స్టోన్ క్రషింగ్‌తో పాటు చెత్తను తగులబెట్టడాన్ని నిషేధించాల్సిందిగా మిశ్రా సూచించారు. 

Also Read:ఢిల్లీ కాలుష్యం: హెల్త్ ఎమర్జెన్సీ విధింపు.. స్కూళ్లకు సెలవులు, మాస్క్‌లు తప్పనిసరి

ఈ సమావేశానికి ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు పీకే సిన్హాతో పాటు కేంద్ర వ్యవసాయశాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు , వాతావరణ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మరోవైపు కాలుష్యం కారణంగా ఢిల్లీలో నివసించేందుకు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి విధానాన్ని తిరిగి అమలు చేస్తుండటంతో వాహనదారులు స్వాగతిస్తున్నారు. అయినప్పటికీ కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం నిలిపివేయాలని ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.