ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. కాలుష్యం 999 మార్కును చేరుకుంది. ఢిల్లీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఢిల్లీలో  కాలుష్య స్థాయి 600 మార్కును దాటడంతో ముప్పై రెండు విమానాలు మళ్లించబడ్డాయి. నిన్నటి 407 మార్క్ నుండి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లేదా AQI 625 కు పెరిగింది, సాయంత్రానికది 999 కు చేరింది. నగరాన్ని మందపాటి దుప్పటి లాగ కాలుష్యం కప్పేయడం  వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ పరిస్థితిని "భరించలేనిది" అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పొరుగు ప్రాంతాలలో కాలుష్య స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో మంగళవారం వరకు పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ వవిషయంపై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయమై ట్వీట్ చేసారు. "ఉత్తర భారతదేశం అంతటా కాలుష్యం భరించలేని స్థాయికి చేరుకుంది. ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఢిల్లీ  ప్రజలు అనేక త్యాగాలు చేశారు. వారి తప్పులేకుండానే ఢిల్లీ ప్రజలు బాధపడుతున్నారు. పంజాబ్ సిఎం కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకునే ఎటువంటి ఉపశమన చర్యలకైనా మా పూర్తి మద్దతుంటుంది.  ".

కాలుష్యం వల్ల విజిబిలిటీ తక్కువగా ఉంది ఏమి కనపడక ముప్పై రెండు విమానాలను ఢిల్లీ విమానాశ్రయం నుండి మళ్లించినట్లు ఢిల్లీ విమానాశ్రయం నుండి ఒక ప్రకటన వెలువడించింది. వీటిలో 12 ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నాయి. 

వ్యర్థాలను తగలబెట్టడం, పరిశ్రమల నుండి విష ఉద్గారాలు మరియు నిర్మాణ స్థలాల నుండి ధూళిని ఆపడానికి చర్యలు తీసుకోవాలని ఎన్‌సిఆర్ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని కాలుష్య నియంత్రణ సంస్థ కోర్టును కోరింది.

పంజాబ్ లేదా హర్యానా నుండి ఎటువంటి మాట లేదు, ఇక్కడ రైతులు పంట కాలం ముగియగానే త్వరగా భూమిని గోధుమ పంట కోసం తయారుచేయడానికి పంట వ్యర్థాలను తొలగించకుండా దహనం చేస్తారు. అందువల్ల ప్రతి శీతాకాలంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో సంక్షోభానికి దారితీస్తుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దారి చూపాలని కేంద్రాన్ని కోరారు.

బాధిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలని కేజ్రీవాల్ కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కోరారు. కానీ ఇంకా కేంద్రం నుండి స్పందన రాలేదు.

"అన్ని ప్రభుత్వాలు కలిసి వచ్చి కూర్చుని కాలుష్యం గురించి మాట్లాడండి. పంజాబ్ మరియు హర్యానాలో 27 లక్షల మంది రైతులు ఉన్నారు. వారందరినీ ఎలా చేరుకోవాలి? మనం ఇంకా ఎన్ని సంవత్సరాల సమయం తీసుకోవాలి? ఈ సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉంది" అని కేజ్రీవాల్ అన్నారు. 

ఢిల్లీలో రేపటి నుండి సరి-బేసి రోడ్ రేషన్ పథకాన్ని ఢిల్లీ సర్కార్ ప్రారంభిస్తోంది, ఇది నవంబర్ 15 వరకు అమల్లో ఉంటుంది. పాఠశాలలు, కళాశాలలు మంగళవారం వరకు సెలవులు ప్రకటించారు. 

కాలుష్య స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో, జాతీయ రాజధాని ప్రాంతంలో పర్యావరణ కాలుష్య (నివారణ & నియంత్రణ) అథారిటీ శుక్రవారం ప్రజారోగ్య అత్యవసరంగా ప్రకటించింది.