ఉన్నావ్ లో మరో ఘాతుకం: భయ్యా అని వేడుకున్నా వినలేదు

Unnao: 3 men molest woman in forest, shoot video of act
Highlights

ఉన్నావ్ లో మరో ఘాతుకం చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు ఓ మహిళను ఇంటి నుంచి ఎత్తుకెళ్లి, అటవీ ప్రాంతంలో ఆమె పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఉన్నావ్: ఉన్నావ్ లో మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ పట్ల ముగ్గురు వ్యక్తులు అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

ఇంటి నుంచి ఓ మహిళను బలవంతంగా అటవీ ప్రాంతంలోని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితుల కోసం గంగాఘాట్ పోలీసులు వేట ప్రారంభించారు. 

నిందితుల్లో రాహుల్, ఆకాశ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నారు. ఇద్దరు వ్యక్తులు మహిళను వెనక నుంచి లాగుతున్న దృశ్యాలు, ఆమె కేకలు పెడుతున్న వైనం వీడియోలో కనిపిస్తోంది. 

భయ్యా, దయచేసి అలా చేయవద్దు అని మహిళ వేడుకున్నా వారు వినలేదు. నిందితులు ఆమె జుట్టు పట్టుకుని లాగారు, దుర్భాషలాడారు. చెప్పుతో కొడుతా అని ఓ నిందితుడు హెచ్చరించడం కూడా వినిపించింది. రెండు చేతులు జోడించి వద్దని ఆ మహిళ వేడుకోవడం కనిపించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. 

నిరుడు ఉన్నావ్ లో 9 ఏళ్ల బాలికను పాతికేళ్ల యువకుడు రేప్ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ లో బిజెపి ప్రజాప్రతినిధి కులదీప్ సింగ్ సెనగర్ తనపై అత్యాచారం చేసినట్లు 16 బాలిక ఆరోపించింది.

loader