మహిళల కనీస వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిని కేంద్రం మంగళవారం లోక్‌సభలో (lok sabha) ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై సభలో రగడ జరిగింది
మహిళల కనీస వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిని కేంద్రం మంగళవారం లోక్‌సభలో (lok sabha) ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై సభలో రగడ జరిగింది. బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. హడావిడిగా బిల్లును తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ (congress) ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (smriti irani) బిల్లును ప్రవేశపెట్టే సమయంలో లోక్‌సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆందోళనల మధ్యే లోక్‌సభ రేపటికి వాయిదాపడింది.
కాగా.. మహిళల కనీస వివాహ వయసుకు సంబంధించిన అంశాలను పరిశీలించడానికి 2020 జూన్‌లో జయ జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీ అదే ఏడాది డిసెంబర్‌లో నీతి ఆయోగ్‌కు నివేదికను సమర్పించింది. ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీలో నీతి ఆయోగ్ మెంబర్ వీకే పాల్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మహిళ శిశు అభివృద్ది శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియన్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. మొదటి గర్భధారణ సమయంలో మహిళలకు కనీసం 21 ఏళ్లు ఉండాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ తన నివేదికలో నొక్కిచెప్పింది.
ALso Read:అమ్మాయిల కనీస వివాహ వయసు పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం..
టాస్క్‌ఫోర్స్ కమిటీ సమర్పించిన సిఫార్సుల ఆధారంగానే మహిళ కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మహిళల కనీస వివాహ వయసు గురించి ప్రస్తావించిన మోదీ.. ‘ఈ ప్రభుత్వం కుమార్తెలు, సోదరీమణుల ఆరోగ్యం గురించి నిరంతరం శ్రద్ధ వహిస్తుంది. పోషకాహార లోపం నుంచి కుమార్తెలను రక్షించడానికి.. వారికి సరైన వయస్సులో వివాహం చేయడం అవసరం’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో పురుషుల వివాహ కనీస వయస్సు 21 ఏళ్లు కాగా.. మహిళలకు ఇది 18 ఏళ్లుగా ఉన్న సంగతి తెలిసిందే.
హిందూ వివాహ చట్టం (Hindu Marriage Act) 1955లోని సెక్షన్ 5(iii) ప్రకారం వధువు కనీస వయస్సు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలుగా ఉంది. ప్రత్యేక వివాహ చట్టం (The Special Marriage Ac) 1954, బాల్య వివాహాల నిషేధ చట్టం (Prohibition of Child Marriage Act) 2006 కూడా వివాహానికి కనీస సమ్మతి వయస్సు స్త్రీలకు 18, పురుషులకు 21 ఏళ్లుగా నిర్దేశించాయి.
