భారతదేశంలో మహిళల కనీస వివాహ వయస్సు (minimum age of marriage for women) 18 సంవత్సరాలు కాగా .. ఇప్పుడు ఆ వయస్సును పెంచేందుకు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు బుధవారం కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. 

భారతదేశంలో మహిళల కనీస వివాహ వయస్సు (minimum age of marriage for women) 18 సంవత్సరాలు కాగా .. ఇప్పుడు ఆ వయస్సును పెంచేందుకు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు బుధవారం కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. మహిళల కనీస వివాహ వయసు పెంపు చేపట్టాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టంలో మార్పులు తీసుకురావడంపై దృష్టి సారిస్తుంది. మహిళ కనీస వయసు పెంపు అంశం తమ సమీక్షలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఏడాది క్రితం వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్ర్యతేక టాస్క్‌ఫోర్స్ కూడా ఏర్పాటు చేసింది. 

మహిళల కనీస వివాహ వయసుకు సంబంధించిన అంశాలను పరిశీలించడానికి 2020 జూన్‌లో జయ జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీ అదే ఏడాది డిసెంబర్‌లో నీతి ఆయోగ్‌కు నివేదికను సమర్పించింది. ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీలో నీతి ఆయోగ్ మెంబర్ వీకే పాల్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మహిళ శిశు అభివృద్ది శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియన్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. మొదటి గర్భధారణ సమయంలో మహిళలకు కనీసం 21 ఏళ్లు ఉండాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ తన నివేదికలో నొక్కిచెప్పింది.

టాస్క్‌ఫోర్స్ కమిటీ సమర్పించిన సిఫార్సుల ఆధారంగానే మహిళ కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మహిళల కనీస వివాహ వయసు గురించి ప్రస్తావించిన మోదీ.. ‘ఈ ప్రభుత్వం కుమార్తెలు, సోదరీమణుల ఆరోగ్యం గురించి నిరంతరం శ్రద్ధ వహిస్తుంది. పోషకాహార లోపం నుంచి కుమార్తెలను రక్షించడానికి.. వారికి సరైన వయస్సులో వివాహం చేయడం అవసరం’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో పురుషుల వివాహ కనీస వయస్సు 21 ఏళ్లు కాగా.. మహిళలకు ఇది 18 ఏళ్లుగా ఉన్న సంగతి తెలిసిందే. 

హిందూ వివాహ చట్టం (Hindu Marriage Act) 1955లోని సెక్షన్ 5(iii) ప్రకారం వధువు కనీస వయస్సు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలుగా ఉంది. ప్రత్యేక వివాహ చట్టం (The Special Marriage Ac) 1954, బాల్య వివాహాల నిషేధ చట్టం (Prohibition of Child Marriage Act) 2006 కూడా వివాహానికి కనీస సమ్మతి వయస్సు స్త్రీలకు 18, పురుషులకు 21 ఏళ్లుగా నిర్దేశించాయి.