రాజ్యసభ ఎంపీగా పదవీ కాలం పూర్తి : భావోద్వేగానికి గురైన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ .. మోడీకి కృతజ్ఞతలు
బీజేపీ నేత, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ పదవీ కాలం నేటితో ముగియనుంది. తన 18 ఏళ్ల సర్వీసులో 8 ఏళ్లు ప్రతిపక్ష ఎంపీగా వున్నానని రాజీవ్ భావోద్వేగానికి గురయ్యారు. అండగా నిలిచి, మార్గనిర్దేశం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ నేత, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ పదవీ కాలం నేటితో ముగియనుంది. రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం పూర్తి చేసుకున్న ఆయన గురువారం సభలో భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్ ఎంపీగా తన అనుభవాలను పంచుకున్నారు. రాజ్యసభలో రాజీవ్ చంద్రశేఖర్ ప్రసంగిస్తూ.. పార్లమెంట్ ఎగువ సభలో భారత ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన గౌరవమన్నారు. తన 18 ఏళ్ల సర్వీసులో 8 ఏళ్లు ప్రతిపక్ష ఎంపీగా వున్నానని రాజీవ్ గుర్తుచేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు మంత్రిగా, పదేళ్ల పాటు ట్రెజరీ ఎంపీగా పనిచేశానని కేంద్ర మంత్రి తెలిపారు. రాజ్యసభ సభ్యునిగా 2జీ స్కామ్, ఎన్‌పీఏ, ఒకే పెన్షన్, న్యూట్రాలిటీ, డేటా సెక్యూరిటీ వంటి వాటిపై చర్చలు ప్రారంభించానని రాజీవ్ పేర్కొన్నారు.
తాను ఖచ్చితంగా కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించానని.. తన పని, తన కార్యకలపాలు తనకంటే ముందు వచ్చిన వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వుంటాయని ఆశిస్తున్నానని కేంద్ర మంత్రి అన్నారు. రాజ్యసభ ఎంపీగా తన పదవీ కాలం ముగిసిన అనంతరం తనకు అండగా నిలిచి, మార్గనిర్దేశం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు రాజీవ్ చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు.
కర్ణాటకకు చెందిన దివంగత సీనియర్ నేత అనంత్ కుమార్‌ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న కేంద్ర మంత్రి.. ఆ రాష్ట్ర మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పకు సైతం కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాజీ ప్రధాని దేవెగౌడకు కూడా రాజీవ్ ధన్యవాదాలు తెలిపారు. దేవెగౌడ తన రాజకీయ ప్రవేశానికి నాంది పలికారని, తనకు ఎంతో అండగా నిలిచారని రాజీవ్ చంద్రశేఖర్ గుర్తుచేసుకున్నారు.