పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల చాలా తక్కువగా ఉందని చెప్పారు.
దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చమురు ధరల పెరుగుదలపై విపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నాయి. పార్లమెంట్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న చమురు ధరలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల చాలా తక్కువగా ఉందని చెప్పారు. లోక్‌సభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో పెరిగిన ఇంధన ధరలు.. ఇతర దేశాలలో పెరిగిన ధరలలో 1/10 వంతుగా ఉన్నాయని చెప్పారు.
201 ఏప్రిల్ నుంచి 2022 మార్చి మధ్య కాలంలో పెట్రోల్ ధరలు.. యుఎస్‌లో 51 శాతం, కెనడాలో 52 శాతం, జర్మనీలో 55 శాతం, యుకేలో 55 శాతం, ఫ్రాన్స్‌లో 50 శాతం, స్పెయిన్‌లో 58 శాతం పెరిగాయని చెప్పారు. అదే సమయంలో.. భారతదేశంలో కేవలం 5 శాతం మాత్రమే పెరుగుదల ఉందని తెలిపారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో చమురు ధర పెరగడం ప్రారంభమయ్యాయి. గత 15 రోజుల్లో 13 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. మార్చి 22 నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు రూ.9.20 పెరిగాయి. చాలా వరకు ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు మరోసారి రూ. 100 మార్క్‌ను దాటాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 104.61, లీటర్ డీజిల్ రూ. 95.87గా ఉంది.
