పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు : సస్పెన్స్‌కు తెర .. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సాయంత్రం భేటీ అయిన మంత్రి మండలి దాదాపు రెండు గంటల పాటు పలు అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇది సభలో ఆమోదం పొంది చట్టంగా మారితే .. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభించనుంది.
కాగా.. మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని మొత్తం సీట్లలో 33 శాతం లేదా మూడింట ఒక వంతు ఆడపడుచులకు కేటాయించాలని ప్రతిపాదిస్తుంది. దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 81వ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీనిని లోక్‌సభలో తొలిసారిగా ప్రవేశపెట్టింది. అయితే ఆ సమయంలో లోక్‌సభలో బిల్లు రద్దయ్యింది. ఆ తర్వాత వాజ్‌పేయి ప్రభుత్వం 1999, 2002, 2003లో తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ మద్ధతు లభించలేదు. యూఏఏ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందగా.. లోక్‌సభలో మాత్రం పరిశీలనకు తీసుకోలేదు.
అంతకుముందు పార్లమెంట్‌లో మోడీ మాట్లాడుతూ.. చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతున్నట్టుగా ప్రధాని మోదీ తెలిపారు. మనం కొత్త భవనంలోకి వెళ్తున్నప్పటికీ పాత భవనం భావితరాలకు స్పూర్తినిస్తుందని పేర్కొన్నారు. ‘‘స్వాతంత్య్రానికి ముందు ఈ సభ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు వేదికగా ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత ఇది పార్లమెంటు భవనంగా గుర్తింపు పొందింది. ఈ భవనాన్ని నిర్మించాలనే నిర్ణయాన్ని విదేశీ పాలకులు తీసుకున్నారనేది నిజం. అయితే మేము ఎన్నటికీ మరచిపోలేము. ఈ పార్లమెంట్ భవనాన్ని భారతీయుల స్వేదం, డబ్బుతో నిర్మించామని గర్వంగా చెప్పగలను’’ అని అన్నారు.
ఈ సందర్భంగా చరిత్రను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ భవనం వీడి వెళ్తున్నప్పుడు మనలో అనేక అనుభవాలు గుర్తుకువస్తున్నాయని చెప్పారు. ఈ భవనం మన గౌరవాన్ని పెంచిందని అన్నారు. 75 ఏళ్లలో అనేక ఘట్టాలకు వేదికగా నిలిచిందని చెప్పారు. ఈ భవనంతో మనకు తీపి, చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. పార్లమెంట్‌లో విభేదాలు, వివాదాలను మనందరం చూశామని.. అయితే అదే సమయంలో కుటుంబ భావనను కూడా చూశామని చెప్పారు. 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.