కేరళలో రెండు రాజకీయ హత్యలు జరగడంతో అలప్పూజా జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఎస్‌డీపీఐ నేతను కారుతో ఢీకొట్టి.. కత్తులతో పొడిచి ఓ గ్రూప్ చంపేయగా.. 12 గంటల వ్యవధిలోనే ఓ బీజేపీ నేతను ఇంటిలోకి వెళ్లి నరికి చంపింది మరో ముఠా. ఈ రెండు హత్యలతో జిల్లాలో 144 సెక్షన్ అమలవుతున్నది. ఈ రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

తిరువనంతపురం: Keralaలో రక్త చరిత్ర రిపీట్ అయింది. గంటల వ్యవధిలోనే రెండు రాజకీయ హత్యలు(Political Murders) జరిగాయి. నిన్న సాయంత్రం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(SDPI) నేత బైక్‌పై వెళ్తుంటే కారుతో ఢీ కొట్టారు. కత్తితో పొడిచారు. ఆ గాయాలతో హాస్పిటల్‌లో మరణించాడు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే.. సుమారు 12 గంటల్లోనే BJP నేతను హతమార్చారు. ఈ రెండు పార్టీలు పరస్పరం ఒకదానిపై మరొకటి హత్యకు బాధ్యులుగా ఆరోపణలు చేసుకున్నాయి. ఈ హత్యలు రెండు అలప్పూజా జిల్లాలో చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు జిల్లాలో రెండు రోజుల పాటు 144 సెక్షన్ విధించారు.

నిన్న సాయంత్రం ఎస్‌డీపీఐ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్ బైక్‌పై ఇంటికి వెళ్లుతున్నారు. ఆ సమయంలోనే ఓ గ్యాంగ్ కారులో ఆయన బైక్‌ను ఢీ కొట్టింది. ఆయనను అడ్డుకుంది. కత్తితో ఆయనపై దాడి చేసింది. అనంతరం ఆయనను కొందరు కొచ్చి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్చారు. ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఇది జరిగిన 12 గంటల్లోనే మరో నేత హత్య జరిగింది. బీజేపీ నేత ఓబీసీ యూనిట్ నేత రెంజిత్ శ్రీనివాసన్‌ను కొందరు దుండగులు ఇంటికి వెళ్లి నరికి చంపారు. కొందరు దుండగులు గ్యాంగ్‌గా ఏర్పడి బీజేపీ ఓబీసీ మోర్చా సెక్రెటరీ రెంజిత్ శ్రీనివాస్ ఇంటికి ఆదివారం ఉదయం వెళ్లారు. కత్తితో నరికి ఆయనను హతమార్చారు. 

Also Read: ‘నా కూతురు షీనా బోరా బతికే ఉంది.. అక్కడ వెతకండి’.. సీబీఐకి Indrani Mukerjea సంచలన లేఖ..

ఈ రెండు ఘటనలను పోలీసులు విచారిస్తున్నారు. ముందు జాగ్రత్తగా అలప్పూజా జిల్లాలో రెండు రోజుల పాటు సెక్షన్ 144 విధించారు. జిల్లా వ్యాప్తంగా కఠినంగా తనిఖీలు చేస్తున్నారు. అనవసరంగా గుంపులుగా గుమిగూడరాదని పోలీసులు ఆదేశించారు.

ఈ ఘటనపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఇది అమానవీయ, క్రూరమైన దాడి అని వివరించారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు రాష్ట్రానికి ప్రమాదకరం అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆ హంతక ముఠాను కనుగొనడంలో సహకరిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాంటి విద్వేషపూరిత వైఖరిని ఖండిస్తున్నట్టు తెలిపారు.

బీజేపీ జాతీయ జనరల్ సెక్రెటరీ సీటీ రవి కుమారు ఈ ఘటనలపై స్పందిస్తూ సీపీఎం కేరళ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీపీఎం ప్రభుత్వం దైవ భూమిగా భావించే కేరళను జిహాదీల స్వర్గదామంగా మారుస్తున్నదని ఆరోపించారు.

కేంద్ర మంత్రి వీ మురళీధరన్ ఈ దాడులను ఖండించారు. కేరళలో అరాచకం ఉన్నదని, సీపీఎం పాలనలో కేరళ రణభూమిగా మారుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, పౌరులకు భద్రత లేదని, హంతకులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని పేర్కొన్నారు.

బీజేపీ భావజాల సంస్థ ఆర్ఎస్ఎస్‌కు చెందిన వారి పనే ఇది అని ఎస్‌డీపీఐ ఆరోపణలు చేసింది. ఎస్‌డీపీఐ పార్టీ చీఫ్ ఎంకే ఫాయిజీ ట్వీట్ చేసి.. రాష్ట్రంలో మతోన్మాదాన్ని, అశాంతిని రగల్చడానికి చేసిన సంఘ పరివార్ కుట్ర అని ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ టెర్రరిజాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ఆగడాలను అడ్డుకుని రాష్ట్రంలో శాంతియుత జీవనం కొనసాగడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.