Asianet News TeluguAsianet News Telugu

‘నా కూతురు షీనా బోరా బతికే ఉంది.. అక్కడ వెతకండి’.. సీబీఐకి Indrani Mukerjea సంచలన లేఖ..

తన కూతురు షీనా బోరా (Sheena Bora) హత్య కేసుకు సంబంధించి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జియా(Indrani Mukerjea) .. సీబీఐకి సంచలన లేఖ రాశారు. తన కూతురు షీనా బోరా బతికే ఉందని.. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేయల్సిందిగా CBIని ఆమె లేఖలో కోరారు

my Daughter Sheena Bora is alive Indrani Mukerjea in letter to CBI
Author
Mumbai, First Published Dec 16, 2021, 4:00 PM IST

తన కూతురు షీనా బోరా (Sheena Bora) హత్య కేసుకు సంబంధించి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జియా(Indrani Mukerjea) .. సీబీఐకి సంచలన లేఖ రాశారు. తన కూతురు షీనా బోరా బతికే ఉందని.. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేయల్సిందిగా CBIని ఆమె లేఖలో కోరారు. జైలులో తనతో పాటు ఉన్న మహిళా ఖైదీ కశ్మీర్‌లో షీనా బోరాను కలిశానని చెప్పిందని పేర్కొంటూ ఆమె సీబీఐ డైరెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొంది. షీనా బోరా కోసం కశ్మీర్‌లో వెతకాల్సింది కోరింది.  అయితే ఇంద్రాణి ముఖర్జియా రాసిన లేఖను విచారణ అధికారులు అంత సీరియస్‌గా తీసుకునే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

అయితే ఈ పరిణామాలపై ఆమె లాయర్ సనా ఖాన్ స్పందించారు. ఇంద్రాణి ముఖర్జియా సీబీఐకి లేఖ రాశారని, కానీ అందులో పేర్కొన్న అంశాలకు సంబంధించి తమ వద్ద వివరాలు లేవని చెప్పారు. మరోవైపు ఆమె బెయిల్ కోసం అధికారిక దరఖాస్తు చేసుకున్నట్టుగా చెప్పారు. ఇక, ఈ కేసుకు సంబంధించి ఇంద్రాణి ముఖర్జీని 2015లో  అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నాయి. ఆమె బెయిల్ దరఖాస్తును బాంబే హైకోర్టు గత నెలలో తిరస్కరించింది. త్వరలోనే ఆమె సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. 

my Daughter Sheena Bora is alive Indrani Mukerjea in letter to CBI

అసలు షీనా బోరా హత్య కేసు ఏమిటి..?
ఇంద్రాణి ముఖర్జియా మూడో భర్త పీటర్ ముఖర్జియా. అయితే ఇంద్రాణి తన మొదటి భర్త ద్వారా కలిగిన కూతురు షీనా బోరాను.. పీటర్ ముఖర్జియా కుటుంబానికి తన చెల్లెలిగా పరిచయం చేసింది. అయితే పీటర్ ముఖర్జియా మొదటి వివాహం ద్వారా కలిగిన కొడుకు రాహుల్ ముఖర్జియాకు, షీనా బోరాకు మధ్య ఏర్పడిన పరిచయం సహజీవనం చేసే స్థాయికి చేరింది. అయితే ఈ విషయం తెలిసి ఇంద్రాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరికి కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ షీనా బోరా, రాహుల్ కలిసి జీవించాలని నిర్నయించుకున్నారు.  రాహుల్‌ను పెళ్లి చేసుకుంటానని షీనా బోరా ఇంద్రాణితో చెప్పింది.

అయితే ఇది ఆర్థికంగా తనకు ఇబ్బందికరంగా మారుతుందని భావించిన షీనా బోరాను ఇంద్రాణి గట్టిగా వారించినట్టుగా చెబుతారు. దీంతో తాను కూతురిననే విషయం బయటకు చెప్తానని ఇంద్రాణిని షీనా బోరా బెదిరించింది. ఈ క్రమంలోనే 2012లో షీనా బోరాను ఇంద్రాణి తన రెండో భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్‌‌తో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత షీనా గురించి ఇంద్రాణిని ప్రశ్నిస్తే.. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లిందని చెప్పేది.

ఇక, 2015లో ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ వేరే కేసులో అరెస్ట్ అయ్యాడు. అప్పుడు అతన్ని విచారిస్తుంగా.. ఈ కేసు గురించి వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ వాంగ్మూలం ఆధారంగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసు విచారణ 2017లో ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు దాదాపు 60 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇంద్రాణి మరియు పీటర్ ముఖర్జీతో పాటు, సంజీవ్ ఖన్నా (ఇంద్రాణి మాజీ భర్త), మరియు శ్యాంవర్ రాయ్ (ఇంద్రాణి డ్రైవర్) కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ముంబైకి సమీపంలోని అడవుల్లో షీనా అవశేషాలు దొరికాయని దర్యాప్తు సంస్థలు కూడా తెలిపాయి. 

ఈ కేసులో ఇంద్రాణఇ డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ అప్రూవర్‌గా మారాడు. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో పీటర్ ముఖర్జియా, ఇంద్రాణితో తన వివాహ బంధం ముగించాలని భావించాడు. 2019 అక్టోబర్‌లో ముంబైలోని ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ఇక, 2020 మార్చిలో పీటర్ ముఖర్జియా సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios