ఇద్దరు విదేశీ పౌరులు ఒకరు లండన్, మరికొరు ఖాట్మాండ్ వెళ్లడానికి బోర్డింగ్ పాస్‌లు తీసుకున్నారు. కానీ, ఖాట్మాండ్ వెళ్లాల్సిన శ్రీలంక పౌరుడు మెరుగైన ఉపాధి అవకాశాల కోసం లండన్ వెళ్లాలని అనుకున్నాడు. వీరిద్దరూ ఎయిర్‌పోర్టులోనికి వెళ్లిన తర్వాత చెకింగ్‌లు ముగించుకన్నాక టాయిలెట్‌లో బోర్డింగ్ పాస్‌లు మార్చుకున్నారు. 

ముంబయి: ఇద్దరు విదేశస్తులు.. ముంబయి ఎయిర్‌పోర్టు సమీపంలోనే విలాసవంతమైన హోటల్‌లో బస చేశారు. ఆ హోటల్‌లో వారిద్దరు కలిసి ఓ కుట్రకు తెరలేపారు. చెకింగ్‌లు అన్నీ ముగిశాక ఎయిర్‌పోర్టులోపలికి వెళ్లిన తర్వాత బోర్డింగ్ పాస్‌లు మార్చుకోవాలని, తద్వార వేర్వేరు దేశాలకు వెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు. అనుకున్నట్టుగానే ఎయిర్‌పోర్టులోకి వెళ్లిన తర్వాత టాయిలెట్‌లో బోర్డింగ్ పాస్‌లు మార్చుకున్నారు. కానీ, వారి ప్లాన్ బెడిసికొట్టింది.

శ్రీలంక జాతీయుడు, జర్మన్ పౌరుడు ఈ ప్లాన్ వేసి అడ్డంగా బుక్కయ్యారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలోని ఖరీదైన హోటల్‌లో వీరిద్దరూ ఓ ప్లాన్ వేసుకున్నారు. 22 ఏళ్ల శ్రీలంక పౌరుడి వద్ద నేపాల్‌ రాజధాని ఖాట్మాండ్ వెళ్లడానికి బోర్డింగ్ పాస్‌లు ఉన్నాయి. కానీ, యూకేకు వెళ్లి మంచి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావించాడు. మరో వైపు జర్మనీ దేశస్తుడు లండన్‌కు వెళ్లాల్సి ఉన్నది. అందుకు సంబంధించిన బోర్డింగ్ పాస్ ఆయన దగ్గర ఉన్నది.

సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ చెకప్‌లు అయిపోయిన తర్వాత వారిద్దరూ ఎయిర్‌పోర్టులోని టాయిలెట్‌లో కలుసుకున్నారు. వారి బోర్డింగ్ పాస్‌లు మార్చుకున్నారు. కానీ, ఓ ఎయిర్‌లైన్ అధికారి వారి స్కామ్‌ను బట్టబయలు చేశాడు. శ్రీలంక దేశస్తుడు ట్రావెల్ డాక్యుమెంట్‌లోని తేడాలను గుర్తించాడు.

Also Read: అమెరికా : డెయిరీ ఫాంలో భారీ పేలుడు.. మంటల్లో చిక్కి 18,000 గోవులు సజీవ దహనం, యజమానికి ఎంత నష్టమంటే..?

శ్రీలంక పాస్‌పోర్టుపై డిపార్చర్ స్టాంప్ నెంబర్, బోర్డింగ్ పాస్ నెంబర్లు సరిపోలడం లేవని ఆ అధికారి గుర్తించాడు. తాను దొరికిపోయానని గ్రహించిన ఆ శ్రీలంక పౌరుడు తన వాస్తవ గుర్తింపును అధికారులకు చెప్పాడు. కాగా, ఖాట్మాండ్ వెళ్లే బోర్డింగ్ పాస్‌లతో ఉన్న జర్మనీ పౌరుడినీ పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు.

వారిద్దరిపై పోలీసులు కేసు పెట్టారు. చీటింగ్, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర అభియోగాల కింద కేసు ఫైల్ అయింది. ఈ నేరంలో వీరిద్దరి పాత్రే ఉన్నదా? మరికొందరి ప్రమేయమూ ఉన్నదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.