టెక్సాస్‌లోని ఒక డైరీ ఫామ్‌లో భారీ పేలుడు కారణంగా చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో దాదాపు 18000కు పైగా ఆవులు చనిపోయాయి. ప్రతి ఆవు విలువ 2000 అమెరికన్ డాలర్లు కాగా.. ఈ ప్రమాదం కారణంగా యాజమాన్యానికి భారీ నష్టం కలిగింది.
వెస్ట్ టెక్సాస్‌లోని ఒక డైరీ ఫామ్‌లో భారీ పేలుడు కారణంగా చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో దాదాపు 18000కు పైగా ఆవులు చనిపోయాయి. అమెరికా చరిత్రలో ఇంతటి భారీ స్థాయిలో పశువులు మరణించిన ఘటన ఇదే. టెక్సాస్ రాష్ట్రంలోని పాన్ హ్యాండిల్‌లో సోమవారం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఇంతటి విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ప్రమాదంలో పశువులతో పాటు ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే పేలుడు ఎందుకు జరిగిందన్న దానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదే సమయంలో వేలాది గోవులను టెక్సాస్ ప్రభుత్వం , అమెరికా డెయిరీ అధికారులు ఖననం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
డిమిట్‌లోని సౌత్ డైరీ ఫాంలో పేలుడు జరిగినప్పుడు అవులకు అప్పుడే పాలు పితకడం పూర్తయ్యిందని, అవి విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన జరిగిందని కాస్ట్రో కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. అయితే ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ కొన్ని ఆవులు బయటపడ్డాయని స్థానిక అధికారులు తెలిపారు. వ్యవసాయ పరికరాల్లో ఏదో లోపం తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు, దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. దీని వల్లే మంటలు చెలరేగి అగ్నిప్రమాదం చోటు చేసుకుని వుండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఆవుల పరిస్ధితి విషమంగా వుందని తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని రక్షించిన సహాయక బృందాలు ఆసుపత్రికి తరలించాయి.
మంటలను అదుపు చేస్తుండగా.. గంటల తరబడి డైరీ ఫాం పైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఈ పొగ కొన్ని మైళ్ల దూరంలో వున్న గ్రామాలు, పట్టణాల వరకు కనిపించింది. ఈ ఘటనలో చనిపోయిన ఆవుల సంఖ్య అమెరికాలో ప్రతిరోజూ చంపుతున్న ఆవుల కంటే దాదాపు మూడు రెట్లు అధికం. ప్రమాదంలో చనిపోయిన ఆవులలో ఎక్కువ భాగం హోల్‌స్టెయిన్, జెర్సీ ఆవుల మిశ్రమం. ప్రతి ఆవు విలువ 2000 అమెరికన్ డాలర్లు కాగా.. ఈ ప్రమాదం కారణంగా యాజమాన్యానికి భారీ నష్టం కలిగింది. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2021వ సంవత్సరానికి గాను టెక్సాస్ వార్షిక డైరీ రివ్యూ ప్రకారం క్యాస్ట్రో కౌంటీలో 30 వేలకు పైగా పశువులు వున్నాయి.
