సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌, భారత ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేగింది. కొత్తగా జారీ చేసిన ఐటీ మార్గదర్శకాల ప్రకారం ట్విటర్‌ ఇంకా భారత్‌లో అధికారులను నియమించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ శనివారం తుది నోటీసులు జారీ చేసింది. తక్షణమే అధికారులను నియమించాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.   

డిజిటల్ మీడియా, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లకు సంబంధించి కంటెంట్‌ నియంత్రణ కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనల అమలు కోసం సోషల్‌మీడియా సంస్థలకు ఇచ్చిన 3 నెలల గడువు ముగియడంతో మే 26 నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి వచ్చాయి. అయితే ఈ గైడ్‌లైన్స్ కింద చీఫ్‌ కాంప్లియన్స్‌ ఆఫీసర్‌ను ఆయా సంస్థలు నియమించాల్సి ఉండగా.. ట్విటర్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంతేగాకుండా రెసిడెంట్ గ్రీవెన్స్‌ ఆఫీస్‌, నోడల్‌ కాంటాక్ట్‌ అధికారులుగా భారత్‌కు చెందిన వ్యక్తులను నియమించకపోవడంతో కేంద్రం ఆగ్రహించింది. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చి వారం గడుస్తున్నా ట్విట్టర్ వీటిని పాటించేందుకు విముఖత చూపిస్తోందని సర్కార్ మండిపడింది.

Also Read:వెంకయ్య నాయుడి హ్యాండిల్ కి వెరిఫైడ్ బ్లూ బ్యాడ్జిని తిరిగి ఇచ్చిన ట్విట్టర్

ఈ క్రమంలోనే కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ శనివారం మరోసారి ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇదే చివరి నోటీసు అని, నిబంధనలు తక్షణమే పాటించకపోతే ట్విటర్‌ తన మధ్యవర్తిత్వ హోదాను కోల్పోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించింది. అప్పుడు సంస్థ చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.   

అంతకుముందు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు వెరిఫైడ్‌ బ్లూ టిక్‌ మార్క్‌ను శనివారం ట్విట్టర్ తొలగించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఆ వెంటనే బ్లూ టిక్ మార్క్‌ను పునరుద్దరించింది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్దిసేపటికే ట్విట్టర్‌కు నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది.