ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్సనల్ అకౌంట్ కి వెరిఫైడ్ బ్యాడ్జిని ట్విట్టర్ పునరుద్ధరించింది. అకౌంట్ చాలా కాలంగా ఇనాక్టివ్ గా ఉన్న కారణంగా ట్విట్టర్ అల్గోరిథం దాన్ని తొలగించినట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. బ్లూ టిక్ తొలిగించిన కొద్దిసేపటికే తిరిగి దాన్ని ట్విట్టర్ పునరుద్ధరించింది. 

వెంకయ్య నాయడు పర్సనల్ అకౌంట్ చాలా కాలంగా స్తబ్దుగా ఉంది. ఆయన పర్సనల్ హ్యాండిల్ నుండి పోయిన సంవత్సరం జులై నెలలో ఆఖరు ట్వీట్ చేయబడింది. ఇక అప్పటినుండి వేరే ట్వీట్ లేదు. ట్విట్టర్ నిబంధనల అనుసారం 6 నెలలకుపైగా ఇనాక్టివ్ గా ఉండే అకౌంట్లకు వెరిఫీడ్ బ్యాడ్జిని ట్విట్టర్ తొలగించే ఆస్కారం ఉందని ట్విట్టర్ ఎప్పుడో తమ రూల్స్ లో పేర్కొంది. 

ఈ కారణంగానే వెంకయ్య నాయుడు పర్సనల్ హ్యాండిల్ నుండి ఈ బ్లూ టిక్ ని తొలిగించింది ట్విట్టర్ అల్గోరిథం. పర్సనల్ హ్యాండిల్ నుండి బ్లూ టిక్ తీసివేయబడ్డప్పటికీ... అధికారిక ఉపరాష్ట్రపతి కార్యాలయం అకౌంట్ కి సంబంధించిన బ్లూ టిక్ మాత్రం అలానే ఉంది. 

ట్విట్టర్ లో బ్లూ టిక్ అనేది వెరిఫైడ్ అకౌంట్ ని సూచిస్తుంది. సెలబ్రిటీ, వీఐపీ అకౌంట్లను అఫిషియల్ అంటూ తేలికగా గుర్తించడం సామాన్యుడికి సులభమవుతుంది.వెంకయ్య నాయుడి అకౌంట్ కి బ్లూ టిక్ ని తీసివేయడంతో ట్విట్టర్ పై పలువురు మండిపడ్డారు. వెంకయ్య నాయుడి అకౌంట్ కన్నా ఎక్కువ కాలంగా ఇనాక్టివ్ గా ఉన్న కొన్ని అకౌంట్లకు తొలగించని వెరిఫీడ్ బ్యాడ్జిని వెంకయ్య నాయుడు అకౌంట్ హ్యాండిల్ నుంచి తొలిగించడాన్ని తప్పుబట్టారు.