న్యూఢిల్లీ: సత్యాన్ని(వాస్తవం) ఇబ్బంది పెట్టొచ్చు, కానీ ఓడించలేమని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవుల నుండి తొలగించిన తర్వాత  సచిన్ పైలెట్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.

మంగళవారం నాడు జైపూర్ లోని ఫెయిర్ మౌంట్ రిసార్ట్స్ లో జరిగిన సీఎల్పీ సమావేశానికి సచిన్ పైలెట్ సహా ఆయన వర్గీయులు గైర్హాజరయ్యారు. సచిన్ సహా ఆయన వర్గీయులపై చర్యలు తీసుకోవాలని సీఎల్పీ సమావేశం డిమాండ్ చేసింది.

డిప్యూటీ సీఎం పదవితో పాటు పీసీసీ చీఫ్ పదవి నుండి సచిన్ పైలెట్ ను కాంగ్రెస్ పార్టీ తొలగించింది. రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ మంగళవారం నాడు మధ్యాహ్నం గవర్నర్ ను కలిశారు. తన మంత్రి వర్గం నుండి ముగ్గురిని తొలగిస్తున్నట్టుగా ఆయన గవర్నర్ కు లేఖ ఇచ్చారు. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ఆమోదం తెలిపారు.

also read:సచిన్‌కు కాంగ్రెస్ షాక్: డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ బాధ్యతల నుండి పైలెట్ తొలగింపు

సచిన్ సహా ముగ్గురు మంత్రులను తొలగించిన విషయాన్ని సీఎం గవర్నర్ కు వివరించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని సీఎం గెహ్లాట్ ఆరోపించారు. ఈ డ్రామాలో సచిన్ పైలెట్ కూడ భాగమయ్యాడన్నారు.

జైపూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సచిన్ పైలెట్ పేరుతో ఉన్న నేమ్ ప్లేట్ బోర్డును తొలగించారు. పీసీసీ చీఫ్ గా గోవింద్ సింగ్ ను నియమిస్తూ కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో సచిన్ పైలెట్ నేమ్ ప్లేట్ తో ఉన్న బోర్డుపై గోవింద్ సింగ్ పేరును చేర్చారు.