కుటుంబసమేతంగా తొలిసారి భారతదేశ పర్యటనకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఘనస్వాగతం లభించింది. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన క్షణం నుంచి మొతేరా స్టేడియం వరకు రోడ్లుకు ఇరువైపులా లక్షలాది మంది ప్రజలు భారత, అమెరికా జాతీయ పతాకాలు పట్టుకుని ట్రంప్‌కు ఘనస్వాగతం పలికారు.

దీనిపై అమెరికా అధ్యక్షుడి సీనియర్ సహాయకుడు స్పందిస్తూ.. తన కెరీర్‌లో ఇలాంటి స్వాగతం చూడలేదన్నారు. స్టేడియానికి వెళ్లే మార్గంలో ట్రంప్ కాన్వాయ్‌లో తాను ఉన్నానని.. ఇలాంటి దృశ్యం ఎప్పుడూ చూడలేదన్నారు.

Also Read:భారతీయ సినిమాలు గొప్పవి, సచిన్, కోహ్లీలు ఇక్కడివారే: ట్రంప్

రోడ్‌షో సందర్భంగా రోడ్డుపై వున్న వ్యక్తుల ఫోటోలను ట్రంప్ వ్యక్తిగత సహాయకుడు డాన్ స్వావినో జూనియర్ ట్వీట్ చేశారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొతేరా స్టేడియం వరకు రోడ్‌షో జరిగిందని.. అమెరికా అధ్యక్షుడిని స్వాగతిండానికి ప్రజలు హోర్డింగ్‌లు, జెండాలు పట్టుకుని నిలుచున్నారని డాన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి సబర్మతి ఆశ్రమంలో కొద్దిసేపు ఆగిపోయారు. మొతేరా స్టేడియంలో ట్రంప్ 1,00,000 మందికి పైగా ప్రజలనుద్దేశించి ప్రసగించారని డాన్ తెలిపారు.

Also Read:టాక్ ఆఫ్ ది కంట్రీ: తల్లీ కూతుళ్ల డ్రెస్సింగ్ స్టైల్ కి నెటిజన్లు ఫిదా

ట్రంప్ పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్‌లో గట్టి భద్రత కల్పించారు. 33 డిప్యూటీ కమీషనర్లు, 75 మంది అసిస్టెంట్ కమీషనర్లతో పాటు మొత్తం 108 మంది సీనియర్ అధికారులతో పాటు జూనియర్ ఆఫీసర్లు, జవాన్లు భద్రతా విధుల్లో పాలుపంచుకున్నారు.

తన పర్యటనలో భాగంగా ట్రంప్ తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు ఆగ్రాకు వెళ్లి, అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్లను కలిసేందుకు ఢిల్లీ చేరుకుంటారు.