సారాంశం
లండన్‌లో భారత హైకమిషన్ కార్యాలయం మీదున్న జాతీయజెండాకు అవమానం జరిగిన కాసేపటికి.. అక్కడ భారీ స్థాయిలో జాతీయ జెండాను ఏర్పాటు చేసి.. ఖలిస్తాన్ వేర్పాటు వాదులకు చెంపపెట్టు సమాధానం చెప్పారు.
న్యూఢిల్లీ : లండన్ లోని భారత హై కమిషన్ కార్యాలయం మీద ఎగురుతున్న జాతీయ జెండాకు ఖలిస్తాన్ వేర్పాటు వాదులు అగౌరపరిచారు. జెండాను దించేశారు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే జెండాను వారి చేతుల్లోంచి లాక్కుని భద్రపరిచారు. అయితే వీరి చర్యలకు చెంపపెట్టు సమాధానంగా కాసేపటికే జాతీయ జెండాను అమర్చారు. లండన్‌లోని భారత హైకమిషన్ భవనంపై ఇప్పుడు భారీ త్రివర్ణ పతాకం అలంకరించబడింది. లండన్‌లోని ఆల్డ్‌విచ్‌లోని ఇండియా హౌస్‌లో విస్తరించి ఉన్న భారీ జాతీయ జెండా ఫోటో వైరల్‌గా మారింది, సోషల్ మీడియాలో దీనిమీద ప్రశంసలు కురుస్తున్నాయి.
ట్విటర్ పోస్ట్‌లో ఫోటోను పంచుకుంటూ, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్, "ఝండా ఊంచా రహే హమారా"- లండన్‌లోని హైకమిషన్‌లో భారత జెండాను అగౌరవపరిచేందుకు ప్రయత్నించిన దుర్మార్గులపై యూకే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. పంజాబ్, పంజాబీలకు దేశానికి సేవ చేయడం/రక్షించడం అనే అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. యూకేలో కూర్చున్న కొన్ని జంపింగ్ జాక్‌లు పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించవు."
లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్థాన్ అనుకూలవాదుల దాడి.. మండిపడ్డ భారత్...
ఖలిస్తానీ మద్దతుదారుడు జాతీయ జెండాను కిందకు లాగిన దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. భారత్ ఆగ్రహానికిగురైంది. సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖలిస్తాన్ జెండాను విసిరిన హైకమిషన్ అధికారి సాహసోపేతమైన చర్యను పలువురు ప్రశంసించారు. భారత జెండాను తీసివేస్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రచారంలోకి రావడంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ క్రిస్టినా స్కాట్‌ను పిలిపించింది.
హైకమిషన్ ప్రాంగణంలో "భద్రత లేకపోవడం" గురించి మంత్రిత్వ శాఖ వివరణ కోరింది . భారత దౌత్యవేత్తలు. సిబ్బంది పట్ల యూకే ప్రభుత్వం "ఉదాసీనత" "ఆమోదయోగ్యం కాదు" అని పేర్కొంది. భారత హైకమిషన్‌పై జరిగిన దాడి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని యూకే విదేశీ కామన్వెల్త్ అండ్ అభివృద్ధి వ్యవహారాల మంత్రి లార్డ్ తారిక్ అహ్మద్ ట్వీట్ చేశారు.
"లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఈరోజు జరిగిన దాడి పట్ల దిగ్భ్రాంతికి గురయ్యాను. కమిషన్, దాని సిబ్బంది సమగ్రతకు వ్యతిరేకంగా ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాని చర్య. యూకే ప్రభుత్వం ఎల్లప్పుడూ భారత హైకమిషన్ భద్రతను తీవ్రంగా పరిగణిస్తుంది" అని ఆయన అన్నారు.
కాగా, లండన్ లో ఖలిస్థాన్ అనుకూలవాదులు భారత హై కమిషన్ బిల్డింగ్ పై ఉన్న జాతీయ జెండాను కిందికి దించారు. అలా జెండాను అగౌర పరచడం మీద భారత్ మండిపడింది. ఢిల్లీలోని బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్తకు ఈమెరకు భారత్ సమన్లు జారీ చేసింది. ఖలిస్థాన్ వేర్పాటువాదులు లండన్ లో చేసిన పనిని మన దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపింది. అక్కడి ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు, ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ అనుచరులను రెండు రోజుల క్రితం పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పంజాబ్లో రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.