పంజాబ్, హర్యానా హైకోర్టులకు చెందిన నలుగురు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టు నుండి ఒక న్యాయమూర్తితో సహా మొత్తం తొమ్మిదిమందిని బదిలీ చేయాలని సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది.
న్యూఢిల్లీ : 'మోదీ ఇంటిపేరు' అనే వ్యాఖ్యపై క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు కొలీజియం బదిలీకి సిఫార్సు చేసింది. వివిధ రాష్ట్రాల హైకోర్టులకు చెందిన తొమ్మిది మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆ జాబితాలో జస్టిస్ హేమంత్ ఎం ప్రచ్చక్ కూడా ఉన్నారు.
జులైలో 123 పేజీల తీర్పులో జస్టిస్ హేమంత్ ఎం ప్రచ్చక్, రాహుల్ గాంధీ అభ్యర్థనను తిరస్కరించారు. దోషిపై స్టే విధించడానికి ఎటువంటి కేసు చేయలేదని చెప్పారు. దీనికి సంబంధించి గత రాత్రి సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం.. "మెరుగైన న్యాయం కోసం" బదిలీలను కొలీజియం సిఫార్సు చేసింది.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి
గతంలో, జస్టిస్ ప్రచ్చక్ 2002 గుజరాత్ అల్లర్ల కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ బీజేపీ మంత్రి మాయా కొద్నానీ తరఫున వాదించిన న్యాయవాదుల బృందంలో ఒకరిగా ఉన్నారు. జస్టిస్ ప్రచ్చక్ గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో గుజరాత్ ప్రభుత్వంలో అసిస్టెంట్ ప్లీడర్‌గా పనిచేశారు.
2015లో, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన సంవత్సరం తర్వాత, గుజరాత్ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2021లో గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ ప్రచ్చక్‌తో పాటు, 2002 గోద్రా అల్లర్ల కేసులో కల్పిత సాక్ష్యంలతో తనపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారని ఆరోపిస్తూ.. దాన్ని రద్దు చేయాలంటూ తీస్తా సెతల్వాద్ చేసిన అభ్యర్థన విచారణ నిలిపివేసిన జస్టిస్ సమీర్ దవే, జస్టిస్ గీతా గోపిని కూడా బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. తనపై చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాను సస్పెండ్ చేయాలంటూ రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌పై విచారణ నుంచి జస్టిస్ గీతా గోపి తప్పుకున్నారు.
జస్టిస్ సమీర్ దవే ఇటీవల ఓ తీర్పు నేపథ్యంలో "మనుస్మృతి" ప్రస్తావన తెచ్చి వివాదాన్ని ఎదుర్కొన్నారు. మైనర్ రేప్ బాధితురాలు తన గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి కోసం చేసిన అభ్యర్థనను విచారిస్తున్నప్పుడు జస్టిస్ సమీర్ దవే "మనుస్మృతి" ప్రస్తావన చేశారు.
"మీ అమ్మను లేదా అమ్మమ్మని అడగండి. పెళ్లికి పద్నాలుగు-పదిహేను యేళ్ల వయస్సు గరిష్టం.. అమ్మాయిలు 17 ఏళ్లు నిండకముందే మొదటి బిడ్డకు జన్మనిచ్చేవారు.అమ్మాయిలు అబ్బాయిల కంటే ముందే పరిపక్వం చెందుతారు. ఇది మీకు తెలియకపోతే.. ఇప్పటివరకు మనుస్మృతి చదవకపోతే దాన్ని ఒకసారి చదవాలి" అని జస్టిస్ దవే మౌఖిక పరిశీలనలలో పేర్కొన్నారు.
పంజాబ్ , హర్యానా హైకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టు నుండి ఒకరు కూడా సిఫార్సు చేసిన తొమ్మిది పేర్ల జాబితాలో ఉన్నారు. ఆగస్టు 3న జరిగిన సమావేశంలో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. కొలీజియం తీర్మానాన్ని నిన్న రాత్రి అప్‌లోడ్ చేశారు. "మెరుగైన న్యాయం కోసం బదిలీలు సిఫార్సు చేశాం" అని వివరణ ఇచ్చారు.
