Bharat Mobility Global Expo 2024 : 2047 నాటికి ‘‘ వికసిత్ భారత్ ’’ దిశగా నేటి భారతం : నరేంద్ర మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన దేశంలోనే అతిపెద్దదైన ‘‘ Bharat Mobility Global Expo 2024 ’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని సాకారం చేయడంలో మొబిలిటీ రంగం కీలకపాత్ర పోషిస్తుందని మోడీ ఆకాంక్షించారు.
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన దేశంలోనే అతిపెద్దదైన ‘‘ Bharat Mobility Global Expo 2024 ’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌కు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ఈ ఎక్స్‌పో నిర్వహించడం దేశానికి సంతోషకరమని క్షణమని.. ఢిల్లీ ప్రజలు భారత్ మంటపాన్ని సందర్శించి.. ఎక్స్‌పోను చూడాలని మోడీ విజ్ఞప్తి చేశారు.
ఈ అద్భుతమైన ఈవెంట్‌ను నిర్వహించినందుకు ఆటోమోటివ్ పరిశ్రమకు ఆయన అభినందనలు తెలియజేశారు. తాను అన్ని స్టాల్స్‌కు వెళ్లలేకపోయానని.. కానీ తాను చూసిన స్టాల్స్ చాలా బాగున్నాయని మోడీ ప్రశంసించారు. తానెప్పుడూ కారు కొనలేదని, కనీసం సైకిల్ కూడా కొనలేదని అందుకే తనకు పెద్దగా ఈ విషయాలపై అవగాహన లేదని ప్రధాని చెప్పారు.
ప్రధానిగా తన మొదటి విడతలో గ్లోబల్ లెవల్ మొబిలిటీ కాన్ఫరెన్స్‌ని ప్లాన్ చేశానని.. సెకండ్ టర్మ్‌లో ఎంతో పురోగతిని చూస్తున్నానని నరేంద్ర మోడీ చెప్పారు. తెలివైన వ్యక్తికి చిన్న సూచన సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని సాకారం చేయడంలో మొబిలిటీ రంగం కీలకపాత్ర పోషిస్తుందని మోడీ ఆకాంక్షించారు.
ఎర్రకోట ప్రాకారాల మీద నుంచి 'Yahi Samay, Sahi Samay hai' అనే మాటను అన్నానని.. దేశ ప్రజల సామర్ధ్యాల వల్లే ఆ మాటలు అన్నానని ప్రధాని తెలిపారు. నేడు భారత ఆర్ధిక వ్యవస్ధ వేగంగా విస్తరిస్తోందని.. మన ప్రభుత్వ హయాంలో ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించనుందని మోడీ ఆకాంక్షించారు.
2014కి ముందు పదేళ్లలో దేశంలో దాదాపు 12 కోట్ల వాహనాలు అమ్ముడుపోయాయని.. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో 21 కోట్లకు పైగా వాహనాలు అమ్ముడుపోయాయని మోడీ తెలిపారు. పదేళ్ల క్రితం సుమారు 2 వేల ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించబడ్డాయని, ఇప్పుడు 12 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతున్నాయని ప్రధాని చెప్పారు. గడిచిన పదేళ్లలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో దాదాపు 60 శాతం వృద్ధి నమోదైందని ప్రధాని పేర్కొన్నారు. ఇదే సమయంలో గడిచిన పదేళ్లలో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని మోడీ ప్రస్తావించారు. అటల్ టన్నెల్, అటల్ సేతును ఉదాహరణలుగా ప్రధాని పేర్కొన్నారు.
మూడోసారి అధికారంలోకి రాగానే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామని మోడీ చెప్పారు. 2014లో భారతదేశ మూలధన వ్యయం రూ.2 లక్షల కోట్లకు కంటే తక్కువేనని.. అది నేడు రూ.11 లక్షల కోట్లకు పెరిగిందని ప్రధాని తెలిపారు. భారతదేశంలోని మొబిలిటీ రంగానికి అనేక అవకాశాలను తెచ్చిపెట్టిందని.. సముద్రాలు, పర్వతాలను తాము సవాల్ చేస్తున్నామని మోడీ చెప్పారు. రికార్డు సమయంలో ఇంజనీరింగ్ అద్భుతాలను నిర్మిస్తున్నామని.. అటల్ టన్నెల్ నుంచి అటల్ సేతు వరకు భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కొత్త రికార్డులను సృష్టిస్తోందని మోడీ తెలిపారు. గడిచిన పదేళ్లలో 75 కొత్త విమానాశ్రయాలను , 4 లక్షల గ్రామీన రహదారులను నిర్మించినట్లు ఆయన వెల్లడించారు.