నేడు అయోధ్యలో అద్భుత ఘట్టం ...  భక్తుల మధ్యకు బాలరాముడి విగ్రహం 

బుధవారం అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిషృతం కానుంది.  గర్భాలయంలో ప్రతిష్టించే బాలరాముడి విగ్రహం నేడు అయోధ్య వీధులగుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకోనుంది. 

Today Ram Lalla idol reached Ayodhya Temple AKP

అయోధ్య : శ్రీరామ జన్మభూమి అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దమయ్యింది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అతిరథ మహారథుల సమక్షంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి వారంరోజుల ముందునుండే అయోధ్యలో పూజలు ప్రారంభమయ్యాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట క్రతువుల్లో అతి ముఖ్యమైన ఘట్టం నేడు జరగనుంది. బాల రాముడి విగ్రహం బుధవారం అయోధ్యకు చేరుకోనుంది.  

మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎంతో నిష్టతో అయోధ్య రామయ్య శిల్పాన్ని అద్భుతంగా చెక్కాడు.  ఐదేళ్ల వయసున్న బాలరాముడి విగ్రహాన్ని అయోధ్య గర్బాలయంలో ప్రతిష్టించనున్నట్లు ఆప్పటికే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. కానీ రామ్ లల్లా విగ్రహ రూపాన్ని మాత్రం బయటపడకుండా జాగ్రత్త పడింది. ఇవాళ ఆ బాలరాముడి సుందరరూపం భక్తులకు దర్శనమివ్వనుంది. భారీ ఊరేగింపుగా రామయ్య విగ్రహం ఇవాళ అయోధ్య ఆలయానికి చేరుకుంటుంది. అలాగే సరయూ నది పవిత్ర జలంతో కూడిన కలశాలు కూడా ఆలయానికి చేరుకోన్నాయి.

ఇక రేపు అంటే జనవరి 18న అయోధ్యలో గణపతి పూజ, వరుణ పూజ, వాస్తు పూజలు జరగనున్నాయి.  జనవరి 19 అగ్నిదేవుడికి పూజలు, నవగ్రహాల ప్రతిష్ట జరగనుంది. జనవరి 20న సరయు నది నీటితో గర్భగుడిని శుభ్రం చేస్తారు. జనవరి 21న 125 పవిత్ర కలశాల జలంతో బాలరాముడి విగ్రహానికి అభిషేకం చేస్తారు. ఇక జనవరి 22న కీలకమైన శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. 

Also Read  Ayodhya Ram Mandir : 108 అడుగుల బాహుబలి అగరుబత్తి .. వెలిగించిన రామజన్మభూమి ట్రస్ట్ అధినేత (వీడియో)

ఇదిలావుంటే ఇప్పటికే అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసే వివిఐపిలు, విఐపిల కోసం రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది. అతిథులు బస చేసేందుకు భారీ టెంట్ సిటీని రెడీ చేసారు. ఇందులో విఐపి, వివిఐపిల కోసం ప్రత్యేక కాటేజీలను ఏర్పాటుచేసారు. 'నిషాద్ రాజ్ అతిథి గృహ్' గా నామకరణం చేసిన ఈ టెంట్ సిటీలో సీతా రసోయి, శబరి రసోయి పేరిట డైనింగ్ హాల్స్ ఏర్పాటుచేసారు. ఒక్కో డైనింగ్ హాల్లో ఒకేసారి 500 మందికిపైగా భోజనం చేసేలా ఏర్పాట్లు చేసారు.  

ఇక అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ట 22న జరగనుండగా 23 నుండి సామాన్య భక్తులకు దర్శనం కల్పించనున్నారు. దీంతో ఆ బాలరాముడిని దర్శించుకుని తరించేందుకు దేశ నలుమూలల నుండి భక్తులు అయోధ్యకు చేరుకోనున్నారు. దీంతో భక్తుల సౌకర్యార్థం అయోధ్యలో ఇప్పటికే నూతన రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. అంతేకాదు విఐపిల కోసం ప్రత్యేక హెలికాప్టర్ సేవలను కూడా ప్రారంభించారు.  జనవరి 19న లక్నో నుంచి అయోధ్యకు వెళ్లే హెలికాప్టర్ సర్వీస్‌ లు ప్రారంభంకానున్నాయి. ఇలా ఒక్కో హెలికాప్టర్ లో 8 నుండి 18 మంది భక్తులు వెళ్లవచ్చు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios