Ayodhya Ram Mandir : 108 అడుగుల బాహుబలి అగరుబత్తి .. వెలిగించిన రామజన్మభూమి ట్రస్ట్ అధినేత (వీడియో)
రామమందిర ప్రతిష్టాపన వేడుకకు ముందు కార్యక్రమాల్లో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ మంగళవారం 108 అడుగుల అగరబత్తిని వెలిగించారు.
శ్రీరామ జన్మభూమి అయోధ్యలో భవ్య రామాలయం నిర్మాణం పూర్తయిన సంగతి తెలిసిందే. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆలయం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అలాగే శ్రీరామ మందిరాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు. తాజాగా రామమందిర ప్రతిష్టాపన వేడుకకు ముందు కార్యక్రమాల్లో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ మంగళవారం 108 అడుగుల అగరబత్తిని వెలిగించారు.
అనంతరం నృత్య గోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. అగరుబత్తి సువాసన 50 కి.మీ దూరం ప్రయాణిస్తుందని దాస్ చెప్పారు. ఇది వచ్చే 45 రోజుల పాటు వెలుగుతూనే వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ అగరుబత్తిని గుజరాత్‌లోని వడోదర నుంచి అయోధ్యకు తీసుకొచ్చారు. దీని బరువు 3,610 కిలోలు, వెడల్పు దాదాపు మూడున్నర అడుగులు. ఆవుపేడ, నెయ్యి, పూలు, వనమూలికలతో ఈ అగరుబత్తిని తయారు చేశారు. ఒక్కసారి దీనిని వెలిగిస్తే ఏకదాటిగా 15 రోజులు ఇది మండుతూనే వుంటుంది.
కాగా.. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం మంగళవారంనుంచి అయోధ్యలో మొదలయ్యింది. జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు ప్రతిష్ట జరగనుంది. ఆ తరువాతినుంచి సామాన్య భక్తులకు కూడా దర్శనం ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో అయోధ్యలో అనేక మార్పులు జరిగాయి. రామాలయానికి భక్తులను చేరవేయడానికి రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం సిద్ధంగా ఉన్నాయి. ఈ-కార్ సర్వీస్ కూడా ప్రారంభమైంది.
లక్నో నుంచి అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను ప్రారంభించే యోచనలో ఉంది. దీనికి జనవరి 19 తేదీని ఫిక్స్ చేశారు. లక్నో నుంచి అయోధ్యకు వెళ్లే హెలికాప్టర్ సర్వీస్‌లో 8-18 మంది భక్తులు వెళ్లవచ్చు. మీడియా కథనాల ప్రకారం, ప్రయాణీకులు దీనిని ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ఛార్జీలు, బుకింగ్ షెడ్యూల్ గురించి సమాచారం జనవరి 16 సాయంత్రంలోపు అందుబాటులో ఉంటుంది.
ఈ సర్వీస్ తో లక్నో- అయోధ్య మధ్య దూరం 30 నుండి 40 నిమిషాలు ఉంటుంది. మొదట్లో 6 హెలికాప్టర్లను నడపనున్నామని, వీటిని అయోధ్య నుంచి లక్నో వరకు నడపనున్నట్లు నివేదికల్లో తెలిపారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వినోద్ కుమార్ సోమవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కార్యదర్శి చంపత్ రాయ్‌తో సమావేశమై జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠా రోజున సుమారు 100 విమానాలు అయోధ్యకు చేరుకుంటాయని తెలియజేశారు.