ఇండియన్ టైటానిక్ దొరికిందోచ్... సముద్ర గర్భంలో దాగినా చివరికిలా బయటపడింది...
సముద్ర గర్భంలో దాాగిన నావ ఒకటి తాజాగా భారత తీరంలో బయటపడింది. పురాతన కాలంనాటి ఈ భారీ ఓడ చరిత్రేమిటో స్థానికులు కథలు కథలుగా చెబుతున్నారు.
తిరువనంతపురం : టైటానిక్ షిప్ మాదిరిగానే సముద్రగర్భంలో దాగిన ఓ పురాతన ఓడ జాడ భారత సముద్రజలాల్లో దొరికింది. కేరళ తీరంలో స్కూబా డైవింగ్ చేపట్టే ఓ టీం సముద్రంలో పూర్తిగా శిథిలావస్థలో వున్న ఓడను గుర్తించారు. ఈ షిప్ కు సంబంధించిన ఫోటోలు తీసి బయటి ప్రపంచానికి తెలియజేసారు.
కేరళలోని అందమైన సముద్రతీర ప్రాంతాల్లో వరకల బీచ్ ఒకటి. అయితే ఇక్కడ తీరప్రాంత అందాలే కాదు సముద్రంలో రహస్యాలు దాగివున్నాయని తాజాగా బయటపడింది. అంచుతెంగు కోట సమీపంలోని నెడుంగడ కోస్టల్ ఏరియాలో కొందరు స్కూబా డైవర్స్ సముద్రగర్భంలో దాగిన ప్రాచీన ఓడను గుర్తించారు. ఈ షిప్ గతంలో కేరళను పాలించిన డచ్ వారిదిగా చరిత్ర చెబుతోంది. వందల ఏళ్ళక్రితం మునిగిన ఈ నావ శిథిలావస్థలో ఇప్పుడు బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వరకల బీచ్ లో టూరిస్ట్ లను ఆకర్షించేందుకు వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తుంటారు. ఇలా ఇటీవల నలుగురు స్కూబా డైవర్స్ వరకల బీచ్ కు 8 కిలోమీటర్ల దూరంలో సముద్రంలోకి దిగారు. వీరు 45 మీటర్ల లోతులో దాదాపు 50 మీటర్ల పొడవున్న భారీ ఓడ శిథిలాలు గమనించారు. దీన్ని ఫోటోలు తీసి బయటి ప్రపంచానికి చూపించారు.
Also Read కుక్కకు సీమంతం.. చికెన్, మటన్ బిర్యానీ, పాయసం, స్వీట్లతో అతిథులకు విందు.. వీడియో వైరల్..
బాగా లోతులో వుండటంతో పాటు నాచుపట్టి వుండటతో షిప్ ఫోటోలు ఎక్కువగా తీయలేకపోయామని స్కూబా డైవర్స్ బృందం తెలిపింది. అయితే ఈ పురాతన ఓడను కనుగొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ పురాతన ఓడ డచ్ పాలనాకాలం నాటిది అయివుంటుందని... ఆ కాలంలో జరిగిన దాడుల్లోనే ఇది మునిగినట్లు స్థానికులు చెబుతున్నారు.