CM KCR: కేంద్రంపై పోరు.. నేడు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. కీలక అంశాలపై చర్చ..
CM KCR: నేడు టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం మధ్యాహ్నం జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశంలో పార్టీ నేతలతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కేంద్రంపై పోరు వంటి అంశాలపై చర్చ జరగనున్నట్టు సమాచారం.
CM KCR: నేడు టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనుంది. పార్టీ ప్రధాన శ్రేణులు, మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ రెచ్చిపోతున్నాయి. అలాగే, టీఆర్ఎస్ లోని పలువురు నేతల్లో అసంతృప్తి కూడా వెలుగులోకి రావడం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ భవిష్యత్ కార్యచరణ, ప్రభుత్వ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు అధికంగా ఉన్నాయని సమాచారం. రాష్ట్రంలోని ప్రతిపక్షాలను ఎదుర్కొవడంతో పాటు కేంద్రంపై పోరులో భవిష్యత్తు కార్యచరణపై పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలను ఎండగట్టే విధంగా ముందుకు సాగడానికి ప్రణాళికలపై చర్చ కూడా రానుందని తెలిసింది. బీజేపీ ప్రభుత్వం విధానాల వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందంటున్న టీఆర్ఎస్ ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా వ్యూహరచన చేస్తోంది. దానిపై పార్టీ శ్రేణులకు గులాబీ బాసు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నట్టు తెలిసింది.
Also Read: omicron : భారత్‌లో సెంచరీకి చేరువలో ఒమిక్రాన్ కేసులు..
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని పేర్కొంటూ చాలా మంది రైతులు దేశ రాజధాని సరిహద్దులో నిరసనలు చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ రైతు మహా పంచాయత్ లను నిర్వహించి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేంద్రం వెనక్కి తగ్గింది. తెలంగాణలో ధాన్యం పండిస్తున్న రైతన్న పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గడంతో రైతు అందోళనకు గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దీనికి అంతటికీ కారణం కేంద్ర ప్రభుత్వమే అంటూ రాష్ట్ర సర్కారు తీవ్ర విమర్శలు చేసింది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా ఇప్పటికే నియోజకవర్గాల్లో ఆందోళనలు చేయడంతోపాటు, ఇందిరాపార్కు వద్ద ధర్నాలో స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ తెరాస ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
Also Read: coronavirus updates: కరోనాకు డెన్మార్క్ సైంటిస్టుల కొత్త మందు!
మరో ముఖ్య విషయం బొగ్గు గనుల ప్రయివేటీకరణ. బొగ్గుగనుల ప్రయివేటీకరణను నిలిపివేయాలంటూ రాష్ట్ర సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీ ఇప్పటికే లేఖ కూడా రాశారు. ఈ విషయంలో అందరి మద్దతుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ నేతల మద్దతు కూడగట్టేందుకు సీఎం కేసిఆర్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కేంద్రంపై పోరుకు వారితో కలిసి ముందుకు వెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయిన కేసీఆర్ కేంద్రంపై పోరాటానికి కలిసి కేసీఆర్ రావాలని కోరారు. ప్రస్తుతం వీరిద్దరి భేటీ కూడా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఆయా పరిస్థితులను గమనిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మోడీ సర్కారుపై మరో పోరుకు సిద్దమవతున్నట్టుగా తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ తీరుపై మరింత ఉద్ధృతంగా ఉద్యమించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ శ్రేణులందరినీ భాగస్వామ్యం చేసే దిశగా గులాబీ పార్టీ కసరత్తులు చేస్తోది. దీనిపై నేటి సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.