సారాంశం

కర్ణాటక కాలేజీ రెస్ట్‌రూమ్‌లో తోటి విద్యార్థిని వీడియో తీశారు ముగ్గురు అమ్మాయిలు. వీరిని కాలేజీనుంచి సస్పెండ్ చేశారు.

ఉడిపి : ఓ కాలేజీలో ఆప్టోమెట్రీ కోర్సు చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు రెస్ట్‌రూమ్‌లో తోటి విద్యార్థిని వీడియో తీశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వారిని సస్పెండ్ చేసినట్లు కళాశాల యాజమాన్యం ఆదివారం తెలిపింది.

బుధవారం నాడు ఈ ఘటన జరిగిందని, ఆ మరుసటి రోజే విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు నేత్ర జ్యోతి కళాశాల డైరెక్టర్ రష్మీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. బాలికలను రెండు కారణాలతో సస్పెండ్ చేశామని తెలిపారు. ముందుగా కాలేజీలో నిషేధించిన మొబైల్ ఫోన్ తీసుకొచ్చి వీడియో తీశారని ఒక కారణం కాగా, వీడియో తీయడం రెండో కారణం అని ఆమె తెలిపారు.

మ‌రో నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ రాష్ట్రాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తే అవ‌కాశం : ఐఎండీ

ఆమె తెలిపిన వివరాల ప్రకారం,  వీడియో తీసిన ముగ్గురు అమ్మాయిలు బాధితురాలిని పొరపాటున వీడియో తీశారని.. వారి టార్గెట్ వేరే అమ్మాయిలని అన్నారు. ఈ విషయం వారే స్వయంగా బాధితురాలితో తెలిపినట్లు సమాచారం. 

ఆమెముందే ఆ వీడియోను వారు ఫోన్లో డిలీట్ చేశారని డైరెక్టర్ తెలిపారు. అయితే, ఈ విషయాన్ని బాధితురాలు తన ఇతర స్నేహితులకు చెప్పడంతో వారు విషయాన్ని యాజమాన్యానికి తెలియజేసినట్లు డైరెక్టర్ తెలిపారు.

"ముగ్గురు అమ్మాయిలను మేం వెంటనే సస్పెండ్ చేశాం. కొన్ని కారణాల వల్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు. అయితే మేము ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నాం. మేమే దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసాం. 

వీడియో తీయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌లను కూడా ఫోరెన్సిక్ టెస్ట్ కోసం పంపాం" అని రష్మీ చెప్పారు. మల్పే స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను సంప్రదించగా, తమకు ఫిర్యాదు అందిందని, దానిని పరిశీలిస్తున్నామని చెప్పారు.