మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ రాష్ట్రాలను వరదలు ముంచెత్తే అవకాశం : ఐఎండీ
Heavy rains: దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కొండ ప్రాంతాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మహారాష్ట్ర, గుజరాత్ లలో కురిసిన భారీ వర్షాలు రెండు రాష్ట్రాల్లోనూ వరదలకు కారణం అయ్యాయి. దక్షిణాధి రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, మరో నాలుగు రోజుల పాటు దేశవ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు పలు చోట్ల వరదలు సంభవించే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

Heavy rainfall across India: దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వరదలు సంభవించిన సంఘటనలు నమోదయ్యాయి. ఇదే క్రమంలోనే మరో నాలుగు రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్ లోని కుప్వారాలో భారీ వర్షం కురిసింది. ఉత్తరాఖండ్ లో నదులు ఉప్పొంగుతున్నాయి. రానున్న నాలుగు రోజుల్లో పశ్చిమ, మధ్య భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ గుజరాత్ లోని రాజ్ కోట్, గిర్ సోమనాథ్ వంటి కొన్ని పట్టణాలు వరద నీట మునిగాయి.
మహారాష్ట్రలోని విదర్భలో గత 16 రోజుల్లో కురిసిన వర్షాలకు 10 మంది చనిపోయారనీ, వీరిలో యావత్మాల్ జిల్లాలో ముగ్గురు ఉన్నారని రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి అనిల్ పాటిల్ తెలిపారు. కర్నాటకలో మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం కారణంగా బెళగావి జిల్లాలో ఇద్దరు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో శుక్రవారం రాత్రి, శనివారాలతో పోలిస్తే ఆదివారం వర్షాలు తగ్గుముఖం పట్టగా, హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడటం, ఉత్తరాఖండ్ లోనూ ఇదే తరహా పరిస్థితుల కారణంగా చాలా రోడ్లను మూసుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్ లోని గంగా, హిమాచల్ ప్రదేశ్ లోని సట్లెజ్ వంటి రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయనీ, రానున్న నాలుగు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని హిమాచల్ విపత్తుల నిర్వహణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
జమ్మూకాశ్మీర్ లోని కుప్వారాలోని కెరాన్ సెక్టార్ లో మేఘస్ఫోటనం (cloudburst) సంభవించింది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కుప్వారా చీఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ గురుదీప్ సింగ్ తెలిపారు. గుజరాత్ లోని జునాగఢ్ జిల్లాలో ఆదివారం వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు దాదాపు 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో దేవభూమి ద్వారకా, రాజ్ కోట్, భావ్ నగర్, వల్సాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాజస్థాన్ లో నైరుతి, పశ్చిమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా, జోధ్ పూర్ లో కురిసిన భారీ వర్షానికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సొంత ఊరు నీట మునిగింది. రానున్న మూడు, నాలుగు రోజుల పాటు రుతుపవనాలు చురుగ్గా ఉంటాయనీ, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని రాష్ట్ర రాజధాని జైపూర్ లోని వాతావరణ శాఖ డైరెక్టర్ రాధే శ్యామ్ శర్మ తెలిపారు.
పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ రాజస్థాన్ వరకు అల్పపీడనం ఏర్పడిందనీ, దీని ప్రభావంతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు భారీ వర్షాల కారణంగా దాదాపు 4,500 ఇళ్లు దెబ్బతిన్న మహారాష్ట్రలో అధిక వర్షాల వల్ల తలెత్తే సమస్యలను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం తెలిపారు. రాగల నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నది నీటి పారుదల ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.