మహారాష్ట్రలోని బారామతిలో కోట్ల విలువైన దోపిడీకి "ముహూర్తం" పెట్టడానికి ఓ జ్యోతిష్యుడికి రూ. 8 లక్షలు చెల్లించారో దొంగల ముఠా.

మహారాష్ట్ర : ఈ స్టోరీ వింటే వార్నీ అనుకుంటూ ముక్కున వేలేసుకుంటారు. అలాంటి ఓ విచిత్ర ఘటన ఇది. దొంగలు ఈ మధ్య బాగా తెలివి మీరిపోతున్నారు. దొంగతనానికి ఓ విజనూ... ప్లానూ.. స్కెచ్చూ.. అన్నీ ప్రిపేర్ చేసుకుని మరీ చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మనం చదవబోయే ఘటనలో దొంగలు ఇంకో అడుగు ముందుకు వేశారు.

కోట్లాది రూ.లు దోచుకోవాలనుకున్నారు. అయితే, అది విజయవంతం కావాలని ముందుగా ఓ పూజారితో ముహూర్తం కూడా పెట్టించారు. అదే ఇక్కడ ట్విస్ట్. దీనికోసం ఆ పూజారికి రూ.8లక్షలు కూడా ముట్టజెప్పారు. కానీ పాపం.. లక్కు హ్యాండిచ్చింది. అదృష్టం కంటే ముందే దురదృష్టదేవత వారి తలుపు తట్టింది.

'ఇండిగో'లో విషాదం.. రక్తపు వాంతులు.. పైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అంతలోనే..
మహారాష్ట్రలోని బారామతిలో కోట్ల విలువైన దోపిడీకి పాల్పడేందుకు ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలనుకుందో దొంగల ముఠా. దీనికోసం ఓ జ్యోతిష్యుడిని సంప్రదించి రూ.8 లక్షలు చెల్లించారు. అయితే అదృష్టం కలిసిరాకపోవడంతో చోరీ జరిగిన నాలుగు నెలల తర్వాత దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.76 లక్షల విలువైన బంగారం, నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నాలుగు నెలల క్రితం అంటే ఏప్రిల్ 21న బారామతిలోని దేవకట్‌నగర్ ప్రాంతంలో ఈ దోపిడీ జరిగింది. నిందితులను సచిన్ అశోక్ జగ్ధానే, రైబా తానాజీ చవాన్, రవీంద్ర శివాజీ భోంస్లే, దుర్యోధన్ ధనాజీ జాదవ్, నితిన్ అర్జున్ మోరేగా గుర్తించారు. వీరంతా కూలీలు" అని సీనియర్ పోలీసు అధికారి అంకిత్ గోయల్ అన్నారు.

సాగర్ గోఫనే అనే వ్యక్తి ఇంట్లో బంగారం, నగదు, విలువైన వస్తువులు ఉన్నట్లు నిందితులకు సమాచారం అందింది. అనంతరం దోపిడీకి ప్లాన్‌ రచించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, వారు జ్యోతిష్యుడైన రామచంద్ర చవాన్‌ను కలిశారు. దొంగతనం కోసం మంచి ముహూర్తం పెట్టమని కోరారు. దీనికోసం అతనికి రూ. 8 లక్షలు చెల్లించారు.

అతను పెట్టిన ముహూర్తం ప్రకారం ఏప్రిల్ 21న సాగర్ ఇంట్లో లేని సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి భార్య త్రిప్తిపై దారుణంగా దాడి చేశారు. నిందితులు ఆమె చేతులు, కాళ్లు కట్టేసి కొట్టి, రూ.95 లక్షల నగదు, రూ.11 లక్షలకుపైగా బంగారం, మొబైల్ ఫోన్లతో ఇంట్లో నుంచి పరారయ్యారు. అలా కోటి రూపాయల విలువైన నగదు, వస్తువులను నిందితులు ఎత్తుకెళ్లారు.

దోపిడీ వెలుగులోకి రావడంతో, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీలు, నిఘా విభాగం సహాయంతో పోలీసులు నిందితులందరినీ వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు.