అయోధ్యకు వెళ్లే సాధారణ భక్తులు తమతో పాటు తీసుకెళ్లాల్సినవి ఇవే...
రామమందిరం ప్రారంభోత్సవానికి సాధారణ భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు? రాములవారి దర్శనానికి వచ్చే భక్తులు తమతో ఎలాంటి ధృవపత్రాలు తీసుకువెళ్లాలి? నిబంధనలేమైనా ఉన్నాయా?
అయోధ్య : అయోధ్య రామజన్మభూమి మార్గ్ వద్ద ప్రవేశ ద్వారం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ప్రవేశ ద్వారం దగ్గరున్న శిథిలాలను భారీ యంత్రాలతో తరలిస్తున్నారు. మార్గాన్ని సుందరంగా మార్చనున్నారు. రామభక్తుల కోసం నిర్దేశించిన షెడ్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. భక్తులు ఓపికగా చెక్‌పాయింట్ వద్ద క్యూలో నిలబడి, శ్రీరాముని దర్శనం కోసం తమ వంతు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రవేశ ద్వారం వద్ద ఉచిత లాకర్ సేవను, సందర్శకుల సౌకర్య కేంద్రాన్ని అందిస్తుంది. ఇక్కడే హారతికి హాజరయ్యేందుకు పాస్‌లు పంపిణీ చేస్తారు. వీటన్నింటినీ ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ గ్రౌండ్ రిపోర్ట్ చేసింది.
భక్తులకు మార్గదర్శకాలు
దర్శన సమయంలో భక్తులు తమ వస్తువులను భద్రపరచడానికి ట్రస్ట్ అందించిన ఉచిత లాకర్లను ఉపయోగించుకోవాలని తెలిపారు. శ్రీరాముని దర్శన సమయంలో ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు, వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రిమోట్ కీలు, ఇయర్‌ఫోన్‌లను అనుమతించరు. ఆలయానికి వెళ్లే రహదారులపై వివిధ ప్రదేశాలలో క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతాయి. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం చాలా అవసరం.
అయోధ్యలో ఆరు టెంట్ సిటీలు.. రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి వచ్చే అతిథులకు ప్రత్యేక సదుపాయాలు...
ఆర్తి కౌంటర్, డొనేషన్ కౌంటర్, హెల్త్‌కేర్ ఫెసిలిటీ
ఫెసిలిటీ సెంటర్ రోజుకు మూడుసార్లు జరిగే శ్రీరామహారతికి చెందిన పాస్‌ల సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఫెసిలిటీ సెంటర్ లోనే డొనేషన్ కౌంటర్, హోమియోపతిక్ ట్రీట్‌మెంట్ సెంటర్ లు ఉన్నాయి. ఇక్కడ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య వైద్యులు అందుబాటులో ఉంటారు. ఆలయం ఉదయం 7 గంటల నుండి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 7 గంటల వరకు సందర్శన కోసం తెరిచి ఉంటుంది. అదనపు సౌకర్యాలలో వికలాంగులకు ఉచిత వీల్ చైర్ సౌకర్యాలు, కూర్చోవడానికి బెంచీలు ఉన్నాయి.
ప్రతిష్ఠాపన వేడుకలకు సన్నాహాలు
జనవరి 22న జరగనున్న రామాలయ ప్రతిష్ఠాపన మహోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నందున, జిల్లా యంత్రాంగం భక్తుల కోసం నిర్దిష్ట వివరాలను తెలిపింది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు. ఆ రోజున శ్రీరాముని దర్శనం సాధ్యం కాదు. ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం కారణంగా, జనవరి 20 నుండి మూడు రోజుల పాటు సాధారణ, ప్రత్యేక సందర్శకులకు దర్శనం ఉండదు. ఆహ్వానిత అతిథులకు జనవరి 22న ప్రత్యేక దర్శనం ఉంటుంది. జనవరి 25న సాధారణ ప్రజల కోసం ఆలయం తిరిగి తెరవబడుతుంది. దర్శనం కోసం వెళ్లే భక్తులు ప్రత్యేక గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
వేడుకకు కాల్ చేయండి
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ జనవరి 22న ప్రాణ ప్రతిష్ట వేడుకను దేవవ్యాప్తంగా ఉన్నవారంతా జరుపుకోవాలని కోరారు. గ్రామాలు, ప్రాంతాలు లేదా దేవాలయాల చుట్టూ ఉత్సవాలు నిర్వహించాలని, భజన కీర్తనల కోసం రామభక్తులను సమీకరించాలని తెలిపారు. టీవీ లేదా ఎల్ ఈడీ డిస్ప్లేల ద్వారా వేడుకను చూడాలని, శంఖం ఊదడం, హారతి ఇవ్వడం, ప్రసాదం పంచడం.. ఇళ్లలో భజన-కీర్తన-ఆరాధనలో పాల్గొనాలని చంపత్ రాయ్ కోరారు. 500 సంవత్సరాల తర్వాత ఈ చారిత్రాత్మక క్షణాల్లో భక్తుల సామూహిక వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చింది.