ఢిల్లీలోని రంజీత్ నగర్‌లో కారుకు దారి ఇవ్వడం లేదని ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది. దీనికి కారణమైన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ : ఢిల్లీలో శనివారం రాత్రి దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ 39 ఏళ్ల డెలివరీ వర్కర్ ను చిన్న వివాదం కారణంగా కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని రంజీత్ నగర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. కారుకు దారి ఇవ్వడం లేదని మొదలైన వాగ్వాదం లో పంకజ్ ఠాకూర్ అనే వ్యక్తిని తీవ్రంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసులో మనీష్ కుమార్ (19), లాల్‌చంద్ (20) అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం అర్థరాత్రి రంజీత్ నగర్ మెయిన్ మార్కెట్ సమీపంలోని సందులో ఠాకూర్ అపస్మారక స్థితిలో కనిపించాడు. అతని పక్కనే అతని స్కూటర్ పడిపోయి ఉంది. అది గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఠాకూర్ శరీరంపై పలు గాయాలున్నట్లు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు వచ్చి అతని వద్ద ఉన్న పేపర్లను బట్టి పంకజ్ ఠాకూర్ గా పోలీసులు గుర్తించారు. అతను ఓ షాపులో హెల్పర్‌గా పనిచేస్తూ కిరాణా సరుకులు డెలివరీ చేసేవాడని గుర్తించారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అపార్ట్ మెంట్లోకి చొరబడ్డ ముసుగు వ్యక్తులు.. ఫ్లాట్ డోర్ మీద కాల్పులు జరిపి పరార్...
తమ విచారణలో భాగంగా పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు క్యాబ్‌లో నుండి దిగడం, ఠాకూర్‌తో వాదిండం స్పృహ కోల్పోయి నేలపై కుప్పకూలిపోయేంత వరకు కొట్టడం గమనించారు. పోలీసులు క్యాబ్ నంబర్‌ను ఉపయోగించి ట్రాక్ చేసి నిందితులను మనీష్, లాల్‌చంద్‌గా గుర్తించారు. వారికోసం వారి ఇంటికి చేరుకునేసరికి.. ఆ ఇద్దరు నిందితులు పారిపోయినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు వారిని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. నిన్న మధ్యాహ్నం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు శనివారం రాత్రి చిన్న సందులోనుంచి క్యాబ్ లో వెడుతున్నారు. ఆ సమయంలో ఠాకూర్ తన స్కూటర్‌తో ఆ గల్లీలో నిలబడి ఉన్నాడు. అది వారికి అడ్డుగా ఉండడంతో తీయమని అన్నారు. అలా వాగ్వాదం మొదలైంది. వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో క్యాబ్ లోని ఇద్దరూ కారు దిగి ఠాకూర్ స్కూటర్‌ను తోసేశారు. ఇది గొడవకు దారితీసింది. ఠాకూర్ ను కొట్టారు. దీంతో ఠాకూర్ కుప్పకూలిపోయాడు. వెంటనే మనీష్, లాల్‌చంద్ అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
