మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్ మహిళా ఎమ్మెల్యే ఒకరు సివిల్ ఇంజనీర్ ను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై విమర్శలురావడంతో ఆమె స్పందించారు. తాను చేసింది తప్పుకాదని అన్నారు. ఇళ్లు కోల్పోయి ఏడుస్తున్న మహిళను చూసి ఆయన నవ్వారని, అందుకే తాను చెంపదెబ్బ కొట్టానని తెలిపారు.
మహారాష్ట్ర ఇండిపెండెంట్ మహిళా ఎమ్మెల్యే ఓ జూనియర్ సివిల్ ఇంజనీర్ ను కాలర్ పట్టుకొని చెంపదెబ్బ కొట్టింది. అతడిని 'నలయక్' (పనికిరానివాడు) అని కూడా దూషించిది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. అయితే ఆమె తన చర్యను సమర్థించుకున్నారు. ఇది సహజ ప్రతిచర్య అని చెప్పుకొచ్చారు.
థానే జిల్లాలోని మీరా భయాందర్ ఎమ్మెల్యే గీతా జైన్. ఆమె నియోజకవర్గంలోని భయాందర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారులు కొన్ని అక్రమ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశారు. తమకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఒకే సారి ఇవి అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేశారని ఆరోపించారు. వీరంతా నిరసన చేపట్టారు. ఈ విషయం ఎమ్మెల్యే గీతా జైన్ కు తెలిసింది. దీంతో ఆమె వెంటనే అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఇంటిని కోల్పోయిన ఓ కుటుంబం రోడ్డుపై నిలబడి ఏడుస్తూ ఉండటాన్ని ఆ ఎమ్మెల్యే గమనించారు. అందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
సెప్టెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా..? నేడు హైదరాబాద్ కు రానున్న సీఈసీ బృందం
దీంతో ఎమ్మెల్యేకు కోపం వచ్చింది. ఇంజనీర్లను గట్టిగా నిలదీశారు. మీరు చేసిన పని వల్ల ఓ కుటుంబ సభ్యులంతా నిరాశ్రయులు అయ్యారని, రోడ్డుపై నిలబడాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాన్ని కూల్చివేయడంపై ఇంజనీర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె కోపం ఆపుకోలేక ఓ ఇంజనీర్ కాలర్ పట్టుకొని, చెంపదెబ్బ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఎమ్మెల్యే తీరుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. అయితే దీనిపై ఎమ్మెల్యే జైన్ స్పందించారు. తాను చేసింది తప్పు కాదని అన్నారు. ఇంటిని కోల్పోయిన మహిళలు అక్కడ ఏడుస్తూ నిలబడి ఉండే, ఆ ఇంజనీర్ వారిని చూస్తూ నవ్వాడని అన్నారు. ఈ విషయాన్ని తాను గమనించానని, అందుకే విసిగిపోయి చెంపదెబ్బ కొట్టానని అన్నారు. ఇది సహజ ప్రతిచర్య అని ఆమె సమర్థించుకున్నారు. జూనియర్ సివిల్ ఇంజనీర్లు కూల్చివేసిన ఇంట్లో కొంత భాగం మాత్రమే చట్టవిరుద్ధమని జైన్ స్థానిక న్యూస్ ఛానెల్ తో అన్నారు.
ఈ అక్రమ నిర్మాణం బిల్డర్ కు అడ్డంకిగా మారిందని, ప్రభుత్వ సౌకర్యాలు, రోడ్డు కోసం కాదని ఎమ్మెల్యే ఆరోపించారు. అయినా అధికారులు అక్కడికి వెళ్లి అక్రమ భాగాన్ని కూల్చివేయడానికి బదులు ఇల్లు మొత్తాన్ని కూల్చివేశారని ఆరోపించారు. తమ ఇంటి కూల్చివేతను వ్యతిరేకిస్తున్న మహిళల జుట్టును కూడా మున్సిపల్ అధికారులు లాగారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇద్దరు ఇంజనీర్లు బిల్డర్లతో కుమ్మక్కై ప్రైవేటు స్థలంలో కూల్చివేత పనులు చేపట్టారని గీతా జైన్ ఆరోపించారు. తన చర్యకు తాను పశ్చాత్తాపపడటం లేదని, ఏ శిక్షనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు.
అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని చెప్పారు. ‘‘ఆయన (చెంపదెబ్బ కొట్టిన ఇంజనీర్) నాపై కేసు పెట్టనివ్వండి... దాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రైవేటు భూముల్లో నిర్మించిన నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తే ఎలా సహిస్తారు’’ అని ప్రశ్నించారు.
గీతా జైన్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తరువాత శివసేనకు మద్దతు ఇచ్చారు. అయితే గత ఏడాది జూన్ లో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత గీతా జైన్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శిబిరంలో ఉన్నారు.
