మద్యం తాగి వేధిస్తున్నాడని భర్తపై కిరోసిన పోసి నిప్పంటించిన భార్య.. యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు
మద్యం మత్తులో తరచూ వేధింపులకు గురి చేస్తున్న భర్తను హతమార్చిన భార్యకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అలాగే రూ.5 వేల జరిమానా కూడా విధించింది. ఈ ఘటన 2019లో చోటు చేసుకోగా.. తాగాజా తీర్పు వచ్చింది.
మద్యం తాగి వేధిస్తున్న భర్త తీరుపై ఆ భార్య విసుగు చెందింది. అతడి శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన పుదుచ్చేరిలో 2019 ఆగస్టులో జరగగ్గా.. తాజాగా దిండివనం కోర్టు భార్యకు శిక్ష విధించింది. ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి. విల్లుపురం జిల్లాలోని రెడ్డివనంకు చెందిన సేదుపతి (23) పంచర్ లు వేస్తూ జీవనం సాగించేవాడు. అతడు 2019లో అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల మురుగవేణిని ప్రేమించాడు. 2019లో వారికి వివాహం జరిగింది.
వీరిద్దరు ఓ గుడిసెలో కాపురం పెట్టారు. అయితే పెళ్లయిన నాటి నుంచి సేదుపతి తాగి వచ్చి భార్యను వేధించేవాడు. తరచూ ఇలాగే జరగుతుండటంతో మురుగవేణికి విసుగు వచ్చింది. దీంతో అతడిని హతమార్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 2019 ఆగస్టు 1వ తేదీన ఇంట్లో సేదుపతి నిద్రిస్తున్నాడు. ఇదే అదనుగా భావించిన భార్య.. అతడిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. అయితే అందరూ గుడిసెకు నిప్పు అంటుకోవడంతో అతడు మరణించాడని అనుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో మురుగవేణి తన నేరాన్ని అంగీకరించింది. తరచూ మద్యం తాగి వేధించడం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని ఒప్పుకుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి దిండివనం అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో హాజరుపర్చారు. అప్పటి నుంచి అక్కడే విచారణ జరిగింది. కోర్టులో నేరం రుజువు కావడంతో జడ్జి మురుగవేణి శిక్ష ఖరారు చేశారు. రూ.5 వేల ఫైన్, యావజ్జీవ శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు.