హన్మకొండలో ఘోరం.. ఇంట్లో గొడవపడి బయటకు వచ్చిన వివాహిత.. ముగ్గురు వ్యక్తులు ఆటోలో బలవంతంగా ఎక్కించుకొని..
ఓ వివాహితపై అత్యాచారం జరిగిన ఘటన హన్మకొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇంట్లో గొడవపడి బయటకు వచ్చిన వివాహితను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. దివ్యాంగులు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హన్మకొండలో వెలుగులోకి వచ్చింది.
635 గదులు, 30 సమావేశ మందిరాలు, 34 గుమ్మటాలు : తెలంగాణ నూతన సచివాలయంలో ప్రతీది ప్రత్యేకమే
వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండలోని ఓ ప్రాంతానికి చెందిన వివాహిత ఇంట్లో గొడవ పడి మూడు రోజుల కిందట బయటకు వచ్చింది. రోడ్డుపై నిలబడి ఉన్న సమయంలో ముగ్గురు దుండగులు ఆమెను గమనించారు. వెంటనే ఆమెను ట్రాప్ చేశారు. ఆమె నిలబడి ఉన్న ప్రదేశానికి వచ్చి బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు.
అనంతరం ఆటోను భీమారం వైపు తీసుకెళ్లారు. తరువాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను శనివారం ఆశ్రయించింది. తనపై జరిగిన దారుణాన్ని వారికి వివరించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. రాకేష్ అనే ఆటో డ్రైవర్ ను అరెస్టు చేశారు. అతడితో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు మరింత విచారణ జరుపుతున్నారు.