లోక్ సభ ఎన్నికల్లో 37 సీట్లకే కాంగ్రెస్ పరిమితం - ఇండియా టీవీ-సీఎన్ ఎక్స్ సర్వే అంచనా..
దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ (Congress party)వచ్చే లోక్ సభ ఎన్నికల తరువాత చారిత్రాత్మక దిగువకు పడిపోయే అవకాశం ఉందని ఇండియా టీవీ-సీఎన్ ఎక్స్ సర్వే అంచనా (India TV-CNX survey) వేసింది. ఆ పార్టీ కేవలం 37 స్థానాలు గెలుచుకోవచ్చని పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీకి మరిన్ని గడ్డు రోజులు రానున్నాయా ?.. ప్రాంతీయ పార్టీల మాదిరిగా రెండంకెల స్థానానికి పడిపోనుందా ? కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ మళ్లీ దూసుకుపోనుందా..? ఈ సారి కూడా అత్యధిక స్థానాలు గెలుచుకునే అతి పెద్ద పార్టీగా నిలవనుందా ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే వినిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ‘ఇండియా టీవీ-సీఎన్ ఎక్స్ సర్వే’ సంస్థ వేసిన అంచనాలైతే ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
రైతుల ఆందోళన మళ్లీ షురూ.. నేడు ఢిల్లీ చలో మార్చ్.. సరిహద్దుల్లో పోలీసుల అలెర్ట్..
లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక దిగువకు పడిపోనుందని ‘ఇండియా టీవీ-సీఎన్ ఎక్స్’ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 37 సీట్లు మాత్రమే వస్తాయని ఆ సంస్థ అంచనా వేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత చెత్త ప్రదర్శనను ఇస్తుందని పేర్కొంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా కూటమి కూడా పెద్దగా ప్రభావం చూపదని ఆ సంస్థ తెలిపింది.
ఇండియా కూటమి మొత్తంగా కేవలం 98 స్థానాలకే పరిమితం కావచ్చని సర్వే పేర్కొంది. ఇదిలా ఉండగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) 378 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే తెలిపింది.
హైకోర్టు న్యాయమూర్తి రాజీనామా.. మార్చి 7న బీజేపీలో చేరిక..
కాగా.. 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 44 సీట్లు గెలుచుకుంది. యూపీఏ కూటమిలోని పార్టీలతో కలిసి ఆ సంఖ్య 59కి చేరుకుంది. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 52 స్థానాలు వచ్చాయి. ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ మొత్తంగా 91 స్థానాలను గెలుచుకుంది. అయితే తాజాగా ఇండియా టీవీ-సీఎన్ ఎక్స్ సర్వే ప్రకారం.. 2014 ఎన్నికల కంటే దిగువకు పడిపోతుందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. లోక్ సభ ఎన్నికల దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈ నెల రెండో వారంలో షెడ్యూల్ విడుదల చేయాలని భారత ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా ఏడు దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అధికారికంగా ఇంకా ఎన్నికల తేదీలు ప్రకటించనప్పటికీ.. ఏప్రిల్ మొదటి వారంలో మొదటి దశ ఎన్నికలు జరిగేందుకు ఆస్కారం కనిపిస్తోంది.