రైతుల ఆందోళన మళ్లీ షురూ.. నేడు ఢిల్లీ చలో మార్చ్.. సరిహద్దుల్లో పోలీసుల అలెర్ట్..
స్వల్ప విరామం తరువాత రైతులు ఆందోళన (Farmers Protest) మళ్లీ షురూ చేశారు. రైతు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా నేడు ‘ఢిల్లీ చలో’ (Delhi Chalo) మార్చ్ కు పిలుపునిచ్చాయి. దీంతో రైతులు దేశ రాజధాని బయలుదేరారు.
పలు డిమాండ్లు పరిష్కరించాలని నిరసన చేపట్టి, స్వల్ప విరామం తీసుకున్న రైతులు మళ్లీ ఆందోళన మొదలు పెట్టారు. నేడు ఢిల్లీ చలో మార్చ్ కు పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆందోళనకారులు బస్సులు, రైళ్లలో ఢిల్లీకి బయలుదేరారు. రైతు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) దేశవ్యాప్తంగా ఉన్న రైతులు బుధవారం ఢిల్లీకి చేరుకోవాలని పిలుపునిచ్చాయి.
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ, రైతులు, వ్యవసాయ కూలీలకు పెన్షన్, వ్యవసాయ రుణ మాఫీ, విద్యుత్ ఛార్జీల పెంపు వంటి వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ఈ నెల 10న నాలుగు గంటల దేశవ్యాప్త రైల్ రోకోకు పిలుపునిచ్చారు.
ఢిల్లీకి మార్చ్ చేసే కార్యక్రమం యథాతథంగా ఉందని, దాని నుంచి తాము వెనక్కి తగ్గలేదని రైతు సంఘాల నాయకులు అన్నారు. సరిహద్దుల్లో బలాన్ని పెంచుకోవాలని కోరారు. మార్చి 6న దేశ నలుమూలల నుంచి రైతులు రైలు, బస్సు, విమానాల ద్వారా ఢిల్లీకి వస్తారని, వారిని అక్కడ కూర్చోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుందో లేదో చూస్తామన్నారు. మార్చి 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రైల్ రోకో నిరసన చేపడతామని రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. వివిధ రైతు సంఘాలు ఇచ్చిన 'ఢిల్లీ చలో' మార్చ్ పిలుపును దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ పోలీసులు టిక్రీ, సింఘు, ఘాజీపూర్ సరిహద్దులతో పాటు రైల్వే, మెట్రో స్టేషన్ లు, బస్టాండ్ల వద్ద భద్రతా చర్యలను పెంచారు. ఈ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పోలీసులు తమ సిబ్బందిని ఆదేశించారు. ఢిల్లీ పోలీసులు చేపట్టిన కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా ఇప్పటికే రైల్వే, మెట్రో స్టేషన్లతో పాటు బస్టాండ్ల వద్ద అదనపు పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. చట్టాన్ని ఉల్లంఘించడానికి ఎవరినీ అనుమతించబోమని చెప్పారు.
కాగా.. ఫిబ్రవరి 13న రైతుల కవాతును ప్రారంభించినప్పటికీ హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో భద్రతా దళాలు అడ్డుకోవడంతో ఘర్షణలకు దారితీసింది. అప్పటి నుంచి పంజాబ్, హరియాణాల మధ్య ఉన్న శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద ఆందోళన చేస్తున్న రైతులు తమ 'ఢిల్లీ చలో' మార్చ్ ను అడ్డుకోవడంతో అక్కడే ఉండిపోయారు. రైతుల డిమాండ్లకు సంబంధించి ఆందోళన చేస్తున్న రైతులకు, కేంద్రానికి మధ్య నాలుగు దఫాలుగా చర్చలు జరిగినా ఇంతవరకు ఏకాభిప్రాయం కుదరలేదు.