తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరిచారు.. : ప్రధాని మోడీ పై రాహుల్ గాంధీ ఫైర్
AICC leader Rahul Gandhi: తెలంగాణపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని అవమానపరచడమేనని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అభివర్ణించారు. ‘తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోడీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే’ అని ఎక్స్ లో పోస్ట్ చేసిన సందేశంలో పేర్కొన్నారు.
Rahul Gandhi hits out at PM Modi: పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయం గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సైతం ప్రధాని వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని రాహుల్ గాంధీ అన్నారు.
ఎక్స్ లో చేసిన ఒక పోస్టులో రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోడీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే’ అని తన సందేశంలో పేర్కొన్నారు.
కాగా, సోమవారం పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడం వల్ల రెండు రాష్ట్రాల్లో విద్వేషాలు, రక్తపాతం చోటు చేసుకుందంటూ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఎలాంటి సంబరాలు చేసుకోలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) స్పందిస్తూ ఇది రాష్ట్రానికి అవమానకరమని, చారిత్రక వాస్తవాలను ప్రధాని పూర్తిగా విస్మరించడాన్ని ఇవి ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు.
ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా, ప్రధాని రాష్ట్ర ఏర్పాటును ప్రస్తావిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పోలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది.