బెంగళూరు: ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు తన భార్యపై, అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు రూ. 2కోట్లు డిమాండ్ చేస్తున్నారని, ఆ డబ్బులు ఇవ్వకపోతే వరకట్నం వేధింపుల కేసు పెడుతామని బెదిరిస్తున్నారని అతను ఫిర్యాదు చేశాడు.

బెంగళూరులోని దొడ్డనెక్కుడిలోని చింతల్ లో ధీరజ్ రెడ్డి అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను ఓ ప్రైవేట్ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన భార్య జయ శ్రుతిపై, మరో ఐదుగురిపై అతను మహాదేవపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తమకు 2014లో వివాహమైందని, వజ్రాల నగలు కొనాలని 2017లో తనపై ఒత్తిడి చేసిందని, అది కొనకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని అతను తన ఫిర్యాదులో చెప్పాడు. 

తన భార్య పొగ తాగుతుందని, మద్యం సేవిస్తుందని చెబుతూ ఆ విషయాన్ని తాను తన అత్తింటివారికి చెప్తే ఆమెను ఆపేయాలని చెప్పడానకి బదులు ఆమెనే సమర్థించారని చెప్పాడు. ఆమె చెప్పినట్లు వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తూ వస్తున్నారని అతను చెప్పాడు.

తన ముగ్గురు స్నేహితులను కూడా తన దారిలోకి తెచ్చుకుందని, దాని గురించి అడిగినట్లు తన భార్య రూ.2 కోట్లు డిమాండ్ చేసిందని అతను చెప్పాడు.

దర్యాప్తు అధికారి ముందు విచారణ నిమిత్తం హాజరు కావాలని ఆ ఆరుగురికి నోటీసులు జారీ చేశామని పోలీసులు చెప్పారు. ఫిర్యాదును రిజిష్టర్ చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.