ఒడిశా స్కూల్‌లో సిటప్ లు చేయమని శిక్షించిన టీచర్.. పదేళ్ల చిన్నారి మృతి..
మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిన్నారి పాఠశాల ఆవరణలో తోటి విద్యార్థులతో ఆడుకుంటూ కనిపించాడు. ఇది చూసిన ఓ టీచర్ వారికి శిక్షగా సిట్-అప్‌లు చేయమని ఆదేశించాడు.
ఒడిశా : ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్కూలుకు వెళ్లి విద్యాబుద్దులు నేర్చుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాల్సిన ఓ చిన్నారి టీచర్ కృూరత్వానికి బలయ్యాడు. నాలుగో తరగతి విద్యార్థి తోటి విద్యార్థులతో ఆడుకోవడం చూసిన ఓ టీచర్ పనిష్మెంట్ ఇచ్చాడు. సిట్‌అప్‌లు చేయమని శిక్ష వేశాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థి మరణించాడు. మృతుడి పేరు రుద్ర నారాయణ్ సేథీ. ఒరలిలోని సూర్య నారాయణ్ నోడల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థి.
పదేళ్ల విద్యార్థి మంగళవారం, మధ్యాహ్నం 3 గంటల సమయంలో పాఠశాల ఆవరణలో నలుగురు తోటి విద్యార్థులతో ఆడుకుంటూ కనిపించాడు. ఇది చూసిన స్కూలు టీచర్ క్లాసుల సమయంలో ఆటలాడుతున్నారని పనిష్మెంట్ ఇచ్చారు. శిక్షగా సిట్-అప్‌లు చేయమని ఆదేశించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సిటప్ లు చేస్తున్న సమయంలో రుద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సమీపంలోని రసూల్‌పూర్ బ్లాక్‌లోని ఓరాలి గ్రామంలో నివాసముంటున్న అతని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు వారు తెలిపారు.
సిబ్బంది, ఉపాధ్యాయులు అతనిని సమీపంలోని కమ్యూనిటీ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుండి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, చివరకు మంగళవారం రాత్రి కటక్‌లోని ఎస్ సిబి మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారని వారు తెలిపారు. దీని మీద వివరాలు అడగగా.. రసూల్‌పూర్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నీలాంబర్ మిశ్రా మాట్లాడుతూ, తనకు ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని చెప్పారు.
"అధికారికంగా ఫిర్యాదు వస్తే, మేం దర్యాప్తు ప్రారంభిస్తాం. బాధ్యులపై అవసరమైన చర్యలు తీసుకుంటాం" అని చెప్పాడు. తమకు ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని కుఖియా పోలీస్ స్టేషన్ ఐఐసీ శ్రీకాంత్ బారిక్ తెలిపారు. "పిల్లల తండ్రి లేదా పాఠశాల ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అందువల్ల, పాఠశాలలో బాలుడు మృతికి సంబంధించి ఎటువంటి కేసును నమోదు చేయలేదు" అని తెలిపారు. రసూల్‌పూర్ అసిస్టెంట్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రవంజన్ పతి పాఠశాలను సందర్శించి సంఘటనపై విచారణ ప్రారంభించారు.