Asianet News TeluguAsianet News Telugu

Top Stories : సొరంగంలోనుంచి బైటికి నేడే, గాజాలో నాలుగు రోజుల కాల్పుల విరమణ, మాజీ ఎంపీ వివేక్ పై ఈడీ ఉచ్చు...

అన్ని ప్రముఖ వార్తాపత్రికల్లోని వార్తాకథనాల సమాహారం టాప్ స్టోరీస్. హైదరాబాద్ శివారుల్లో అభ్యర్థుల ప్రచారం ఎలా ఉంది? బస్తీల మీదే అన్ని పార్టీలు నజర్ ఎందుకు పెడుతున్నాయి? గాజాలో కాల్పుల విరమణ ఎప్పుడు? ఇలాంటి ఇలాంటి టాప్ టెన్ వార్తలు మీ కోసం.. 

Top Stories : From the tunnel to the street today, four days ceasefire in Gaza, ED trap on former MP Vivek- bsb
Author
First Published Nov 23, 2023, 7:40 AM IST

 గాజాపై యుద్ధానికి తాత్కాలికంగా విరమణ ఇవ్వనున్న ఇజ్రాయిల్

హమాస్ ఇజ్రాయిల్ ల మధ్య జరుగుతున్న యుద్దానికి కాస్త తెరపి ఇవ్వనున్నారు.  50 రోజులుగా పశ్చిమాసియాలో రాకెట్ల మోత, బాంబుల దాడులు, క్షతగాత్రుల ఆర్తనాధాలతో మారుమోగుతున్న భయానక వాతావరణానికి చల్లటి కబురు ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది. నాలుగు రోజుల కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. దీనికి సంబంధించి 24 గంటల్లో ఒక ప్రకటన వెలువడనుంది. దీనికి కారణం హమాస్ చెరలో ఉన్న  50 మందిని విడిచి పెట్టడానికి వారు ఒప్పుకున్నారు. అయితే దీనికి బదులుగా ఇజ్రాయిల్ జైల్లో ఉన్న 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి ఇశ్రాయేలీయులు అంగీకరించారు. దీనికోసం 300 మందితో కూడిన జాబితాను  సిద్ధం చేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా గాజుపై యుద్ధానికి నాలుగు రోజులపాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించేందుకు ఇజ్రాయేల్ ఒప్పుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వార్తను ఈనాడు ‘తాత్కాలిక సంధి’ అనే పేరుతో మెయిన్ ఐటమ్ గా ప్రచురించింది.
 

సొరంగం నుంచి  గురువారం బయటకి రానున్న కూలీలు ! 

ఉత్తరాకాశి సొరంగం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. సొరంగంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తేవడానికి గత పది రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. రెండు రోజుల క్రితం సొరంగంలోకి ఓ పైపును చొప్పించి వారి యోగక్షేమాలు కనుక్కున్నారు. రెస్క్యూ  ఆపరేషన్ లో ఇదొక  భారీ విజయంగా చెప్పుకోవచ్చు. దీంట్లో ముందడుగుగా నేడు సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటికి తీసుకురాబోతున్నారు. ఉత్తరకాశి సొరంగంలో దాదాపు 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. అమెరికన్ అగర్ యంత్రంతో  సొరంగంలో కూలీలు ఉన్న ప్రాంతానికి చేరుకునేందుకు ఏకధాటిగా ప్రయత్నిస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి చేస్తున్న ఈ ప్రయత్నాలు కనక ఫలిస్తే గురువారం ఉదయానికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక బుధవారం రాత్రి ఎన్డీఆర్ఎఫ్  సిబ్బంది 15 మంది సొరంగంలోకి వెళుతూ కనిపించారు. ఇదంతా కనక ఓకే అయితే గురువారం నాడు వీరందరినీ ఒక్కొక్కరిగా బయటికి వచ్చేలా చేస్తారు. దీనికి సంబంధించిన వార్తను కూడా ఈనాడు మెయిన్ పేజీలో ప్రచురించింది.

ఉత్తరాఖండ్ సొరంగం ఘటన : సంచలనం చేయొద్దు

వివేక్ పై బిగుసుకుంటున్న  ఈడి ఉచ్చు

తెలంగాణలో ఎన్నికలవేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా  కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆయనకు సంబంధించిన ఇల్లు, ఆఫీసులు, అనుచరులు, బంధువుల ఇళ్లల్లో  ఐటీ సోదాలు చేస్తోంది. ఐటీ కి తోడు ఈడి కూడా వివేక్ పై దృష్టి పెట్టింది.  విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇటీవల రూ. 100 కోట్ల నగదు బదిలీ జరిగినట్లుగా ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ సొమ్మును విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు తరలించారు. ఈ విషయాన్ని ఈడీ గుర్తించింది. ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా తేల్చింది. రూ.8 కోట్లు  వివేక్ బ్యాంకు అకౌంట్ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్ సంస్థకు తరలించారు. ఈ మేరకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఈడి దర్యాప్తు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వార్తను కూడా ఈనాడు మొదటి పేజీలో విశాఖ ఇండస్ట్రీస్ నుంచి 100 కోట్ల బదిలీ పేరుతో ప్రచురించింది.

IT Raids : నాపై ఐటీ దాడులకు కారణం అతడే...:కాంగ్రెస్ అభ్యర్థి వివేక్

సత్యసాయి విద్యాసంస్థలు విలువలకు నిలయాలు.. ద్రౌపది ముర్ము

బుధవారం ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విలువలు,  క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి ఒక్కరికి అవసరమని, ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో సమాజ సేవలో పాల్గొనాలన్నారు. సత్యసాయి చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయనీయమని  తెలిపారు. విద్యా, వైద్యం, తాగునీరు, ఆధ్యాత్మిక విస్తరణకు సత్యసాయి కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము పుట్టపర్తి సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వార్తను సాక్షి మొదటి పేజీలో ప్రచురించింది.

బడుగులను చేయి పట్టి అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్న జగన్

ఆంధ్రప్రదేశ్లో వైసిపి సామాజిక సాధికార యాత్ర పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలతో  ప్రజల్లోకి వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలోనే విశాఖలో ‘విజయ నినాదం’ పేరుతో  సభను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వార్తను ‘విశాఖలో బడుగుల విజయ నినాదం’ పేరుతో  బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది. ఈ సభలో వేలాదిగా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలు పాల్గొన్నారు. బడుగులను సీఎం జగన్ చేయి పట్టుకుని అభివృద్ధి పథం పతం వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. 

బీటెక్ రవిని పరామర్శించిన  సీఎం రమేష్

ఆంధ్రప్రదేశ్లో టిడిపిని బతికించడానికి తెలుగు బిజెపి నేతలు దింపుడు కళ్ళం ఆశతో పాట్లు పడుతున్నారని ఓ వార్తని సాక్షి…‘పాపం  తెలుగు బిజెపి’ పేరుతో మొదటి పేజీలో ప్రచురించింది.  ఏపీలో కుంగి, కృషించిపోతున్న టిడిపికి రాజకీయ ప్రయోజనం కలిగించేలా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రయత్నిస్తున్నారని.. దీనికోసం రోజుకో కొత్త ఎత్తుతో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే మరో బిజెపి నేత సీఎం రమేష్.. కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదిగా ఉన్న బీటెక్ రవిని మంగళవారం  పరామర్శించారు. పోలీసులపై దాడికి పాల్పడ్డ కేసులో బీటెక్ రవి రిమాండ్ లో ఉన్నారు. ఆయనను కలిసిన తర్వాత సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. బతికుంటే కదా పులివెందులలో పోటీ చేసేది అని… బీటెక్ రవిని చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ కథనాన్ని సాక్షి పూర్తిగా ప్రచురించింది.

బీటెక్ రవిని కిడ్నాప్ చేసి చంపాలనుకున్నారు..

శివారు నియోజకవర్గాల్లో నువ్వా? నేనా?

తెలంగాణలోని హైదరాబాద్ శివారు నియోజకవర్గాల్లో ఎన్నికల పోటీ విపరీతంగా ఉందంటూ ఓ ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.  శివారులోని పలు నియోజకవర్గాల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీపడుతున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు రసవతరంగా మారాయి. ఎలాగైనా గెలవాలని  శివారు నియోజకవర్గాల్లో లెక్కకు మించి ఖర్చు పెడుతున్నట్లుగా తెలుస్తోంది.  హైదరాబాద్ నగరం లోపల నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వారికి ఖర్చు తక్కువగానే ఉన్నప్పటికీ, శివారు ప్రాంత నియోజకవర్గాల్లోనే ఎక్కువ ఖర్చవుతున్నట్లుగా సమాచారం. ఒక్కో అభ్యర్థికి రోజుకు  కనీసం రూ. 50 నుంచి 60 లక్షల వరకు ప్రచార ఖర్చు అవుతున్నట్లుగా అంచనా.

నగరంలో బస్తీలే ముఖ్యం…

హైదరాబాదులోని నియోజకవర్గాల్లో ఉన్న బస్తీల మీదే అన్ని ప్రధాన పార్టీలు ప్రచారానికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారంటూ ఆంధ్ర జ్యోతి మరో ప్రత్యేక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. బస్తీల్లో ఓట్లను ఎక్కువగా  సాధించేందుకు అక్కడే ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహిస్తూ బస్తీ వాసులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చింది.  గ్రేటర్లో దాదాపు 14 బస్తీలు ఉండగా…ఒక్కో బస్తీలో 1500 నుంచి 2500 వరకు ఓట్లు ఉన్నాయి. అన్ని పార్టీలు దీన్ని టార్గెట్ చేశాయి. బస్తీల్లో రాజకీయాలతో సంబంధం లేని పెద్ద మనుషులను గుర్తించి, వారితో బేరసారాలు జరుపుతున్నాయి పార్టీలు.

హాస్టల్లో నీళ్ల కోసం పాట్లు.. రోడ్డెక్కిన విద్యార్థులు...

మరో ఆసక్తికర వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. హైదరాబాద్ బర్కత్పురాలో నిజాం కాలేజీలో కొత్తగా కట్టిన బాలికల డిగ్రీ హాస్టల్లో  విద్యార్థినులు నెల రోజులుగా నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ  ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడంతో విద్యార్థినులు ధర్నాకు దిగారు. ఈ వార్తను ‘నీళ్ల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు’ అనే పేరుతో ప్రముఖంగా ప్రచురించింది. బుధవారం నాడు పాత పోలీస్ కమిషనరేట్ ఎదురుగా విద్యార్థులు ధర్నాకు దిగడంతో.. కింగ్ కోటి, లిబర్టీ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అసెంబ్లీ వైపు వెళ్లే ట్రాఫిక్ పూర్తిగా స్పందించి తీవ్రస్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

బిఆర్ఎస్ అభ్యర్థిని ఓటు వేయమని అడిగిన బిజెపి అభ్యర్థి

ఎన్నికల ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు కాస్త ఆటవిడుపు సంఘటనలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. దాన్ని ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో ప్రచురించింది. ఇంతకీ ఏం జరిగిందంటే బుధవారం నాడు సనత్ నగర్ లో బిజెపి అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అక్కడే సికింద్రాబాద్ డిఆర్ఎఫ్ అభ్యర్థి పద్మారావు కలిశారు. వెంటనే ఆయన ‘మీ ఓటు నాకే’ అంటూ అడిగారు. దీనికి ఓ కారణం ఉంది. సికింద్రాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి ఓటు సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఎందుకంటే పద్మారావు మోండా మార్కెట్ డివిజన్ పరిధిలో నివసిస్తారు. తన ప్రచారంలో భాగంగా సనత్ నగర్ బిజెపి అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లారు. అయితే, వీరు వెళ్ళేసరికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెనుతిరిగారు. కానీ కాస్త దూరంలోనే ఓ బట్టల షాపులో పద్మారావు కనిపించడంతో ఈ మేరకు అడిగారు.  దీనికి పద్మారావు కూడా నవ్వుతూ ఓటు అడగడం మీ హక్కు అంటూ సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios