అమిత్ షా వర్సెస్ స్టాలిన్.. ‘హిందీ భాషకు మేం బానిసం కాబోం’
హిందీని ప్రధాన భాషగా ఎంపిక చేసే కమిటీ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. విపక్షాలు అడ్డుపడుతున్నా హిందీని ప్రధాన భాషగా అంగీకరించాల్సిందేనని అన్నారు. దీనిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు.
న్యూఢిల్లీ: హిందీని ప్రధాన భాషగా ఎంపిక చేసే అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర మంత్రిపై మండిపడ్డారు. తాము ఎప్పటికీ హిందీ భాషకు బానిసం కాబోమని అన్నారు. ప్రధాన భాష ఎంపిక కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. విపక్షాలు అడ్డుపడుతున్నా హిందీని ప్రధాన భాషగా అంగీకరించాల్సిందేనని అన్నట్టుగా వార్తలు వచ్చాయి. దీనిపై స్టాలిన్ మండిపడ్డారు.
అమిత్ షా వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. హిందీయేతర భాషలు మాట్లాడేవారిని లొంగదీసుకునే ప్రయత్నమే ఇది అని అన్నారు. ‘మన భాష వారసత్వమే మనల్ని డిఫైన్ చేస్తుంది. హిందీ భాషను అనుకరించి మేం బానిసలుగా మారము’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు.
Also Read: గటగటా నీళ్లు తాగేసింది.. మెదడు వాచిపోయి మరణించింది.. ఏం జరిగింది?
అంతేకాదు, ఈ అంశంపై కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో వస్తున్న వ్యతిరేకతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. హిందీని బలవంతంగా రుద్దడంపై తమిళనాడుతోపాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ వ్యతిరేకత వస్తున్నదని వివరించారు. కేంద్ర మంత్రి గారు.. ఆ వ్యతిరేకతను చూడండి అంటూ పేర్కొన్నారు. అంతేకాదు, 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాలను మళ్లీ తీసుకురావొద్దని హెచ్చరించారు.