నటులుగా ఉంటూ ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్ హాసన్, రజనీకాంత్ లు రాజకీయ అజ్ఞానులు అంటూ మండిపడ్డారు. గతంలో అగ్రనటులు శివాజీగణేశన్ పార్టీకి పట్టిన గతే వీరికి తప్పదంటూ హెచ్చరించారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. యావత్ సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లపై నిప్పులు చెరిగారు.
నటులుగా ఉంటూ ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్ హాసన్, రజనీకాంత్ లు రాజకీయ అజ్ఞానులు అంటూ మండిపడ్డారు. గతంలో అగ్రనటులు శివాజీగణేశన్ పార్టీకి పట్టిన గతే వీరికి తప్పదంటూ హెచ్చరించారు.
సేలం జిల్లా, నగర అన్నాడీఎంకే నిర్వాహకులతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఓమలూరులో సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితిపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కమల్ హాసన్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.
తమ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని గొప్పలు చెప్పుకొంటున్న మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ ఇటీవలి ఉపఎన్నికల్లో ఎందుకు పోటీచేయలేదని సీఎం పళని స్వామి నిలదీశారు.
కమల్ హాసన్ తానేదో పెద్ద నాయకుడినని చెప్పుకుంటున్నారని అయితే గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో అందరికీ తెలుసునన్నారు. కమల్ హాసన్ కు వయస్సు దాటిపోయి వృద్ధాప్య దశలోకి చేరుకున్నారన్నారు.
వృద్ధుడు అయిపోవడంతో సినిమా అవకాశాలు రావడం లేదని అందువల్లే రాజకీయాల్లోకి ప్రవేశించారని తెలిపారు. సినిమాలు లేక పోవడంతో కనీసం తమ పార్టీవారైనా చూస్తారనే ఆశతోనే కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం స్థాపించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీని స్థాపించవచ్చునని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే ఇతరులను దూషించడం సరికాదన్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కమల్ హాసన్ ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారని నిలదీశారు.
తాను 1974లో అన్నాడీఎంకేలో చేరానని ఆనాటి నుంచి నేటి వరకు సుమారు 45ఏళ్ళకు పైగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశానని కొన్ని సందర్భాల్లో జైలుకి సైతం వెళ్లినట్లు చెప్పుకొచ్చారు.
ప్రజాభిమానంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఇకపోతే రజనీ, కమల్ వెండితెర నటులే తప్ప వారికి రాజకీయం ఏమీ తెలియదన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల సంఖ్య కూడా తెలియదంటూ ధ్వజమెత్తారు.
కనీసం ప్రజా సమస్యలపై కూడా అవగాహన లేదని మండిపడ్డారు. శివాజీగణేశన్ సొంతపార్టీ పెట్టి ఎన్నికల సమయంలో ఏమయ్యారో అందరికీ తెలుసునంటూ సెటైర్లు విసిరారు సీఎం పళని స్వామి.
ఇకపోతే శివాజీ గణేశన్ పైనా ఆయన రాజకీయ జీవితంపైనా ముఖ్యమంత్రి ఎడపాడి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమాన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతరుల కాళ్ల మీద పడి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న వ్యక్తికి ఆత్మాభిమానం గల మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించింది.
పళనిస్వామికి అధికారం మాత్రమే ఉందని పదవి పోయిన తర్వాత ఆయనను ఎవరూ గుర్తుపెట్టుకోరంటూ మండిపడింది. అదే శివాజీ గణేశన్ మాత్రం తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రకటనలో తెలిపింది.
ఒకప్పడు తమ అభిమాన నటుడి ప్రచారంతో అన్నాడీఎంకే గెలుపొందిన విషయాన్ని పళనిస్వామి మరిచిపోయినట్టు ఉన్నారంటూ ధ్వజమెత్తారు. అలాగే కమల్ హాసన్, రజనీ కాంత్ అభిమానులు కూడా సీఎం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటులను తక్కువ చేసి మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి సరికాదంటూ తిట్టిపోశారు.
ఈ వార్తలు కూడా చదవండి
