మరో పరువు హత్య కలకలం రేపుతోంది. దళితుడిని ప్రేమించిందనే కారణంతో కన్న తల్లి తన కడుపున పుట్టిన బిడ్డను అతి కిరాతకంగా హత్య చేసింది. ఒంటిపై కిరోసిన్ పోసి తగలపెట్టింది. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....  తమిళనాడు రాష్ట్రం వాజ్మంగళం గ్రామానికి చెందిన ఉమా మహేశ్వరి, కన్నన్ దంపతులకు జనని(17) అనే కుమార్తె ఉంది. కన్నన్ కార్పెంటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  కాగా... భార్య ఉమా మహేశ్వరి కూలీపనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉంటుంది. కాగా... వారి ఏకైక కుమార్తె జనని ఓ దళితుడిని ప్రేమించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆమె వచ్చే నెలలో మేజర్ కానుంది.

ఈ నేపథ్యంలో ఆ దళిత యువకుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె తన తీరును మార్చుకోలేదు. 

Also read:స్వీట్లు కొనుక్కోవడానికి దుకాణానికి వెళ్లిన చిన్నారిపై...

ఈ క్రమంలో మంగళవారం ప్రియుడితో కలిసి పారిపోయేందుకు జనని సిద్ధపడింది. అయితే ఈ విషయం జనని తల్లి తెలియడంతో కూతురితో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తురాలైన ఉమ.. కూతురిపై కిరోసిన్‌ పోసి సజీవ దహనం చేసింది. అనంతరం తాను కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. 

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన జనని.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. ఇక ఉమ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉమపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కూతురి హత్యలో తండ్రి కన్నన్‌కు కూడా భాగం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

also read: చేసిన పని ఇదీ:తల్లిని చంపిన కూతుళ్లు