నల్గొండ: తన వైవాహిక జీవితాన్ని నాశనం చేసిందనే కోపంతో కూతురు తల్లిపై కక్ష పెంచుకొంది. తల్లిని హత్య చేసేందుకు తన సోదరి సహాయం కూడ తీసుకొంది. అంతేకాదు ఈ హత్య కోసం రూ. 20వేలిచ్చి మరోకరి సహాయం కూడ తీసుకొంది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకొంది.

నల్గొండ రూరల్‌ మండలం అప్పాజీపేటలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించి నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి మీడియాకు ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు.

అప్పాజీపేటకు చెందిన కల్లూరి సత్యమ్మ (55)కు ఆండాలు, రుద్రమ్మ కూతుళ్లు. సత్యమ్మకు అదే గ్రామానికి చెందిన కూరాకుల యాదయ్యతో వివాహేతర సంబంధం ఉంది. యాదయ్య డబ్బిస్తానని ఆశపెట్టడంతో చిన్న కూతురు రుద్రమ్మను అతడి వద్దకు పంపేది. యాదయ్య కారణంగా రుద్రమ్మ రెండుసార్లు గర్భందాల్చింది. 

చివరికి రుద్రమ్మను యాదయ్యకే ఇచ్చి పెళ్లి చేసింది సత్యమ్మ. యాదయ్య, రుద్రమ్మ దంపతులకు నిఖిత కుమార్తె. భర్తతో మనస్పర్థలు రావడంతో కూతురుతో కలిసి రుద్రమ్మ చౌటుప్పల్‌లో ఉంటోంది. 

రుద్రమ్మ కాపురానికి వచ్చేలా సహకరించాలని సత్యమ్మపై యాదయ్య కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తున్నాడు. అయితే తల్లి కారణంగానే తన జీవితం నాశనమైందని, పైగా ఆమే తనను కాపురానికి వెళ్లమంటోందని ఆమెపై రుద్రమ్మ ఆగ్రహం పెంచుకుంది. పెళ్లయిన పెద్ద కూతురు ఆండాలుకు కూడా మూడేళ్లుగా తల్లితో మాటల్లేవు.

ఈ క్రమంలో సత్యమ్మ హత్యకు రుద్రమ్మ, ఆండాలు పథకం వేశారు. ఇందుకు సహకరించాలంటూ చండూరు మండలం నెర్మటకు చెందిన జి. చిన జంగయ్యతో రూ.20వేలతో సత్యమ్మ ఒప్పందం కుదుర్చుకొంది. అక్టోబరు 31న చౌటుప్పల్‌ నుంచి జంగయ్య, రుద్రమ్మ బైక్‌పై అప్పాజీపేటలోని సత్యమ్మ ఇంటికి వచ్చారు. 

సత్యమ్మను కిందపడేసి కదలకుండా జంగయ్య పట్టుకోగా ఆమె గొంతుపై రుద్రమ్మ కాలితో తొక్కింది. జంగయ్య కూడా బలంగా తొక్కడంతో సత్యమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. 

అనంతరం ఆమె వద్ద ఉన్న 30వేల నగదు, 3 తులాల బంగా రం, 50తులాల వెండి ఆభరణాలను తీసుకొని అక్కడి నుంచి ఇద్దరూ పరారయ్యారు. కాగా పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

 దీంతో భయపడిన ఇద్దరు కుమార్తెలు.తల్లిని తామే చంపామని రక్షించాలని ఆ గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి చెప్పగా ఆయనే వారిని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. అక్కాచెల్లెళతో పాటు జంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.