ఇంటికి దగ్గరలో ఉన్న దుకాణానికి వెళ్లి స్వీట్లు కొనుక్కోవడం ఆ చిన్నారికి అలవాటు. కాగా.. తన దుకాణానికి రోజూ స్వీట్ల కోసం వచ్చే ఆ చిన్నారిపై దుకాణ యజమాని కన్నేశాడు. ఎవరూ చూడని సమయంలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి వయసు కేవలం ఐదు సంవత్సరాలు కాగా.. నిందితుడు 19ఏళ్ల యువకుడు అవడం గమనార్హం. ఈ దారుణ సంఘటన మహేశ్వరం మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి స్థానికంగా అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతోంది. ఆదివారం ఆమె తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. ఆ చిన్నారికి ఇంటి  దగ్గరలోని స్వీట్ల దుకాణంలో తనకు కావాల్సినవి కొనుక్కోవడం అలవాటు. 

రోజూలాగానే చిన్నారి స్వీట్ల కోసం దుకాణానికి వెళ్లింది. అక్కడ చిన్నారికి స్వీట్లు ఇచ్చిన దుకాణదారుడు చందు(19).. అనంతరం బాలిక ఇంటికి వచ్చాడు. చిన్నారి తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయాన్ని ఆసరాగా తీసుకొని  మాయమాటలు చెప్పి అఘాయిత్యం చేశాడు. 

అనంతరం అతడు ఇంట్లో నుంచి బయటకు  వస్తుండగా బాలిక తల్లి గమనించి యువకుడిని ప్రశ్నించగా  సమాధానం చెప్పలేదు. దీంతో అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసింది. కూతురిని పరిశీలించగా అత్యాచారం జరిగినట్లు గుర్తించింది. అనంతరం నిందితుడు పరారయ్యాడు. అదే రోజు రాత్రి మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 యువకుడిని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోమవారం నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకన్ననాయక్‌ తెలిపారు.