ఈడీ చేతిలో అరెస్టు అయిన తరువాత ఛాతీ నొప్పితో హాస్పిటల్ లో చేరిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ శాఖలను తొలగించాలని సీఎం స్టాలిన్.. ఆ రాష్ట్ర గవర్నర్ కు ప్రతిపాదించారు. కానీ దీనిని గవర్నర్ తిరస్కరించారు.

తమిళనాడు ప్రభుత్వ సిఫార్సులను అమలు చేయని గవర్నర్ ఆర్ఎన్ రవి తీరు మళ్లీ వివాదాస్పదంగా మారింది. అరెస్టు అయి, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తమిళనాడు మంత్రి వి.సెంథిల్ బాలాజీ శాఖలను తొలగిస్తూ.. పోర్ట్ పోలియో లేని మంత్రిగా కొనసాగించాలని సీఎం ఎంకే స్టాలిన్ చేసిన ప్రతిపాదనను గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి తెలిపారు. దీంతో ప్రతిపక్ష పాలిత రాష్ట్రంలో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదం కొత్త చర్చనీయాంశంగా మారింది.

ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం తెలంగాణ ఇచ్చింది ఫేక్ జీవో - ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

మనీ లాండరింగ్ కేసులో బాలాజీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు చేసింది. ఆయనకు ఛాతినొప్పి రావడంతో మార్గమధ్యలో ఈడీ అధికారులు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. డాక్టర్లు ఆయనకు సీఏబీజీ బైపాస్ సర్జరీ చేయాలని సూచించడంతో ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో బాలాజీ వద్ద ఉన్న విద్యుత్, మద్యనిషేధ శాఖలను పునర్విభజన చేయాలని సిఫారసు చేస్తూ స్టాలిన్ గురువారం గవర్నర్ కు లేఖ రాశారు. ప్రభుత్వ లేఖ సరికాదని, తప్పుదోవ పట్టించేలా ఉందని రవి తన సమాధానంలో పేర్కొన్నారు. శాఖ మార్పు ముఖ్యమంత్రి హక్కు అని ప్రభుత్వం తిరిగి లేఖ రాసింది.

కాగా.. ఈ విషయంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి మీడియాతో మాట్లాడారు. శాఖల కేటాయింపులపై నిర్ణయం తీసుకునే హక్కు ముఖ్యమంత్రికి ఉందని, రాజ్యాంగం ప్రకారం మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించే హక్కు కూడా ఆయనకు ఉందని, గవర్నర్ కు కాదని పొన్ముడి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యాంగం గురించి గవర్నర్ తెలుసుకోవాలని మంత్రి పొన్నుడి విమర్శించారు. శాఖల పునర్విభజనపై ముఖ్యమంత్రి చేసిన సిఫార్సును గవర్నర్ ఆమోదించి ఉండాల్సిందని అన్నారు. కానీ గవర్నర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

మణిపూర్ లో తారా స్థాయికి అల్లర్లు.. కేంద్ర మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు

కేసును ఎదుర్కొంటున్నంత మాత్రాన మంత్రిని తొలగించలేమని అన్నారు. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఓ రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పదవిని తొలగించారా అని కె.పొన్ముడి ప్రశ్నించారు. కేసులు ఎదుర్కొన్న పలువురు అన్నాడీఎంకే మంత్రులను తొలగించలేదని గుర్తు చేశారు.

ఇదిలా ఉండగా.. బాలాజీ అరెస్టుకు ముందే గవర్నర్ ఆర్ఎన్ రవి సీఎం స్టాలిన్ కు లేఖ రాశారు. బాలాజీని మంత్రివర్గం నుంచి తప్పించాలని మే 31న ఆయన రాసిన లేఖలో ప్రతిపాదించారు. దీనిపై స్టాలిన్ స్పందిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులపై కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ పదవిలో కొనసాగుతున్నారని ప్రస్తావించారు.